వైసీపీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్(Sailajanath) చేరడంపై టీడీపీ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్(Dokka Manikya Varaprasad)స్పందించారు. వైసీపీలో చేరితే రాజకీయ అత్యాచారమేనంటూ ఘాటు విమర్శలు చేశారు. ఆ పార్టీలో చేర్చుకునేటప్పుడు నేతలందరూ అప్యాయంగా ఉంటారని.. ఆ తరువాతే రాజకీయ అత్యాచారం చేయిస్తారని మండిపడ్డారు. వైసీపీలో నైతిక విలువలు ఉండవని.. అదో దుర్మార్గమైన పార్టీ అని ఆరోపించారు.ఆ పార్టీలో దళితులకు స్థానం లేదన్నారు. అలాంటి పార్టీలో చేరితే రాజకీయంగా సమాధి తప్పదని పేర్కొన్నారు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/shailajanadh-1-1024x768.jpg)
కాగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్(Jagan) సమక్షంలో శైలజానాథ్ వైసీపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఏపీ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల పనితీరు నచ్చకే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారని శైలజానాథ్ అనుచరులు చెబుతున్నారు. వైఎస్సార్, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో శైలజానాథ్ మంత్రిగా పనిచేశారు. 2004, 2009ఎన్నికల్లో శింగనమల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో రాష్ట్ర విభజనం అనంతరం ఏపీసీసీ చీఫ్‌గా కొన్నాళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించారు.