Dowleswaram Barrage Water Flow: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదిని వదర ముంచెత్తుతోంది. దీంతో రాజమహేంద్రవరంలో ఉన్న ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరికి వరద పోటెత్తింది. వరద తాకిడికి నది ఉగ్రరూపం దాల్చడంతో అధికారులు బ్యారేజీ మొత్తం గేట్లను ఎత్తివేసి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2,00,600 క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి వెళ్తుంది.ఈ క్రమంలో కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. దాంతో నాలుగు గ్రామాల ప్రజలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. రహదారులు కొట్టుకుపోవడంతో అత్యవసర ప్రయాణం కోసం లంక గ్రామాల ప్రజలు పడవుల్లో ప్రయాణిస్తున్నారు. మరోవైపు సముద్రంలోకి భారీగా వరద వస్తుండటంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవలే ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ మరమ్మతు పనులకు ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేసింది. ఈ బ్యారేజీ గోదావరి జిల్లాల్లో సుమారు 10 లక్షల ఎకరాలకు సాగు, లక్షలాది మంది ప్రజలకు తాగునీరు అందిస్తోంది. ఇలాంటి బ్యారేజీకి చెందిన వివిధ విభాగాల గేట్లు పాడైపోయాయి. దీంతో వరదలు వచ్చినప్పుడు సముద్రంలోకి నీరు వదిలే సమయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మొత్తం 175 గేట్లలో 110 పూర్తిగా తుప్పు పట్టిపోయాయి. దీని వల్ల లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలోకి తరలిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో కొత్త గేట్లను అమరుస్తారు. ఇందుకు సంబంధించిన ఇతర పనులను కూడా అధికారులు చేపట్టనున్నారు.
Also Read: జలకళతో తొణికిసలాడుతున్న శ్రీశైలం జలాశయం..!
మరోవైపు శ్రీశైలం డ్యాంకు కూడా వరద కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 1,48,696 క్యూసెక్కుల నీరు డ్యామ్‌లో చేరుతుంది. దీంతో మూడు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఔట్ ఫ్లో రూపంలో 1,48,734 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్‌కి వెళ్తోంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 882.80 అడుగులుగా ఉంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుత సామర్థ్యం 203.4290 టీఎంసీలుగా ఉంది. అలాగే కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇదిలా ఉంటే డ్యాం అందాలను చూడటానికి పర్యాటకుల తాకిడి పెరిగింది.


