Drought crop management strategies : వర్షాభావ పరిస్థితుల్లో రైతులు నష్టాలను తగ్గించుకుని పంటలను సంరక్షించుకోవాలంటే శాస్త్రీయ సాగు పద్ధతులను తప్పనిసరిగా అనుసరించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. గుడిబండ మండలంలోని వివిధ రైతు సేవా కేంద్రాల పరిధిలోని రైతు పొలాలను గురువారం వ్యవసాయ పరిశోధన స్థానం, అనంతపురం శాస్త్రవేత్తల బృందం సందర్శించి పంటల పరిస్థితిని పరిశీలించింది. అనంతరం రైతులతో సమావేశం నిర్వహించి వర్షాభావ పరిస్థితుల్లో చేపట్టాల్సిన సాగు యాజమాన్య చర్యలపై విస్తృతంగా అవగాహన కల్పించింది.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు డా. ఐ. భాస్కర్ రావు, డా. కె.సి. నటరాజ్, ఎస్.జె.వి. సూర్య, డా. పి. వెంకటరమణ, డా. ఎం. జాహ్నవి పాల్గొని రైతులకు శాస్త్రీయ సలహాలు అందించారు. పంటల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించిన వారు వర్షాభావ పరిస్థితుల్లో పంటలను రక్షించుకునేందుకు సమగ్ర పోషక నిర్వహణ, తేమ సంరక్షణ చర్యలు, కలుపు నివారణ, అంతర దుక్కులు వంటి అంశాలపై రైతులకు వివరించారు.
వేరుశనగ, కంది పంటల్లో వర్షాభావ ఒత్తిడిని తగ్గించేందుకు ఎకరానికి ఒక కిలో పొటాషియం నైట్రేట్ లేదా 19:19:19 ఎరువును నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు.వేరుశనగలో తిక్క ఆకుమచ్చ తెగులు నివారణకు మ్యాంకోజెబ్‌ను లీటరు నీటికి 2.5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలని తెలిపారు.మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు తొలి దశలో వేపనూనెను లీటరు నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేయాలని, పురుగు ఉధృతి అధికంగా ఉంటే ఇమామెక్టిన్ బెంజోయేట్‌ను లీటరు నీటికి 0.4 గ్రాముల చొప్పున వినియోగించాలని సూచించారు.
అదేవిధంగా ఉలవలు, కొర్ర, రాగులు వంటి తక్కువ కాలం పంటలను సాగు చేయాలని, కంది పంటలో తల్లి సాలు (కన్జర్వేషన్ ఫరో) ఏర్పాటు చేయడం ద్వారా వర్షపు నీరు నేలలో నిల్వ ఉండి తేమ ఎక్కువకాలం కొనసాగుతుందని వివరించారు. సెప్టెంబర్ నెల వరకు వర్షపాతం పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలు ఎంపిక చేసుకోవడంతో పాటు నీటి పొదుపు, తేమ సంరక్షణ, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు పనులు చేపడితే మెరుగైన దిగుబడులు సాధించవచ్చని రైతులకు సూచించారు.
రైతులు అడిగిన పలు సందేహాలకు శాస్త్రవేత్తలు సమగ్రంగా సమాధానాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వీర నరేష్, వ్యవసాయ విస్తరణ అధికారులు మంజుల, శారద, రైతు సేవా కేంద్రాల అధికారులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొని వ్యవసాయ శాఖ ద్వారా అందిస్తున్న సాంకేతిక సేవలు, ప్రభుత్వ పథకాలు, పంటల బీమాపై రైతులకు వివరించారు.

