– భక్తిశ్రద్ధలతో అభిషేకాలు, విశేష పూజలు
వేంపల్లె, ( తెలుగుప్రభ ):స్థానిక పట్టణంలోని సాయినగర్‌లో వెలసిన శ్రీ దుర్గమ్మ తల్లి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు శ్రీ దుర్గమ్మ తల్లి శ్రీ కాళరాత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ దుర్గమ్మ తల్లిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చినట్లు ఆలయ వ్యవస్థాపకుడు ఎం. రవికుమార్ రెడ్డి తెలిపారు.
ఆలయ అర్చకులు శాకల్య విష్ణుశర్మ నేతృత్వంలో భక్తిశ్రద్ధలతో శ్రీ దుర్గమ్మ తల్లికి పంచామృత అభిషేకం, మంత్రపుష్పం, మహా మంగళహారతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రతిరోజూ ఉదయం అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండగా, సాయంత్రం పూలతో శ్రీ దుర్గమ్మ తల్లిని అలంకరించి పూజలు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో, పూలతో సుందరంగా అలంకరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

