Dussehra Mahotsav 2025: ఇంద్రకీలాద్రిపై నిర్వహించే దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు రంగం సిద్ధమైంది. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఆలయ పాలకమండలి నిర్ణయించింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను కూడా దుర్గ గుడి ఈవో శీనా నాయక్, వైదిక కమిటీ సభ్యులు విడుదల చేశారు. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది 11 రోజుల పాటు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను జరుపుతున్నట్లు వారు వివరించారు.
11 రోజులపాటు ఉత్సవాలు..
ఈ సంవత్సరం తిథి వృద్ధి చెందడంతో శరన్నవరాత్రులను 11 రోజులపాటు నిర్వహించాలని వైదిక కమిటీ నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా అమ్మవారికి పది అలంకారాలు ఉంటాయి. ఈ ఏడాది సెప్టెంబరు 25న కొత్తగా అమ్మవారు కాత్యాయినీ దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. సాధారణంగా ప్రతి పదేళ్లకు ఒకసారి తిథి వృద్ధి చెందుతుందని.. దాని కారణంగానే ఈ సంవత్సరం శరన్నవరాత్రులు 11 రోజులపాటు జరగనున్నాయని ఆలయ కమిటీ తెలిపింది. గతంలో 2016లో కూడా ఇదే విధంగా జరిగింది.
మూల నక్షత్రం ఎప్పుడంటే?
దసరా మహోత్సవాలు ఆద్యంతం ప్రతి రోజు సాయంత్రం నగరోత్సవాలు, అర్చక సభలు, వేద సభలు ఏర్పాటు చేస్తారు. 11 రోజులు 11 దివ్య అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. మూల నక్షత్రం 29వ తేదీ సోమవారం రావడంతో ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అక్టోబర్ 2వ తేదీ గురువారం విజయదశమి రోజున ఉదయం మహా పూర్ణాహుతి, సాయంత్రం పవిత్ర కృష్ణా నదిలో తెప్పోత్సవం కార్యక్రమం నిర్వహిస్తారు.
అమ్మవారి అలంకారాలు ఇలా..
సెప్టెంబరు 22- శ్రీ బాల త్రిపుర సుందరి అలంకారం
సెప్టెంబరు 23- శ్రీ గాయత్రి దేవి అలంకారం
సెప్టెంబరు 24- శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారం
సెప్టెంబరు 25- శ్రీ కాత్యాయిని దేవి అలంకారం
సెప్టెంబరు 26- శ్రీ మహా లక్ష్మీ దేవి అలంకారం
సెప్టెంబరు 27- శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి
సెప్టెంబరు 28- శ్రీమహా చండీ దేవి అలంకారం
సెప్టెంబరు 29- శ్రీ సరస్వతి దేవి అలంకారం
సెప్టెంబరు 30- శ్రీ దుర్గా దేవి అలంకారం
అక్టోబరు 01- శ్రీ మహిషాసుర మర్దిని దేవి అలంకారం
అక్టోబర్ 02- శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం


