HomeTop StoriesDy CM Pawan Kalyan: 'అమరావతికి చట్టబద్ధత.. ప్రజల ఆత్మగౌరవ పునరుద్ధరణ'

Dy CM Pawan Kalyan: ‘అమరావతికి చట్టబద్ధత.. ప్రజల ఆత్మగౌరవ పునరుద్ధరణ’

Dy CM Pawan Kalyan Amaravati Capital: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ఏకైక శాశ్వత రాజధానిగా నిలవడంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లుగా కొనసాగిన రాజకీయ అనిశ్చితికి తెరపడిందని, ఇకపై అమరావతి అభివృద్ధికి చట్టపరమైన అడ్డంకులు ఉండవని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు బుధవారం లోక్‌సభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అమరావతిని శాశ్వత రాజధానిగా చేస్తూ అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానానికి కేంద్రం ఇప్పుడు చట్టబద్ధత కల్పించింది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/career-news/campus-placements-in-kl-university-highest-annual-package-rs-81-lakhs/

గత ప్రభుత్వ కాలంలో ఉన్న మూడు రాజధానుల వివాదానికి ఈ బిల్లుతో శాశ్వతంగా ముగింపు పలికినట్లయిందని పవన్ అభివర్ణించారు. ఈ మేరకు ‘X’ వేదికగా ట్వీట్‌ చేశారు. అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదని.. వేలమంది రైతుల త్యాగం, ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక అని పేర్కొన్నారు. రాజధానిగా అమరావతిని గుర్తించడంతో పెట్టుబడిదారులలో నమ్మకం ఏర్పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది ‘స్వర్ణాంధ్ర 2047’ లక్ష్య సాధనకు తోడ్పడుతుందని స్పష్టం చేశారు. 

‘33,000 ఎకరాలకు పైగా భూములను రైతులు బలవంతంగా ఇవ్వలేదు. భవిష్యత్‌పై, ఒక దార్శనికతపై నమ్మకంతో ఇచ్చారు. ఈ రోజు వారి నమ్మకాన్ని గౌరవించగలిగాం. ఈ చారిత్రక ఘట్టంలో రాష్ట్రానికి గుర్తింపు కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు. గత కొన్నేళ్లుగా అమరావతిని అనిశ్చితిలోకి నెట్టారు. విధానాలు మార్చి రైతులను మోసం చేశారు. ప్రజల ఆకాంక్షలను నిలిపివేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఆ అనిశ్చితికి తెరపడింది. ఇది కేవలం రాజధాని పునరుద్ధరణ మాత్రమే కాదు. ప్రజల ఆత్మగౌరవ పునరుద్ధరణ. స్పష్టమైన దార్శనికతతో అమరావతి అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం చంద్రబాబుకి, ప్రతి కీలక సమయంలో రాష్ట్రానికి అండగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి, బిల్లుకు మద్దతిచ్చిన అన్ని రాజకీయ పార్టీలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇకపై అమరావతి స్థిరత్వం, ప్రగతికి చిహ్నంగా, తరతరాలకు వారధిగా నిలిచే ప్రజల రాజధాని అవుతుంది.’ అని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు.

Also Read: https://teluguprabha.net/cinema-news/actress-trisha-krishnan-net-worth-and-assets-details-inside/

మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ పరిణామంపై హర్షం వ్యక్తం చేశారు. ఇకపై అమరావతిని ఇంచు కూడా కదపలేరని ధీమా వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News