పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి సంవత్సరం మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా ఎర్త్ అవర్(Earth Hour) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజల్లో పర్యావరణం పట్ల అవగాహన కల్పించడం కోసం గంట పాటు విద్యుత్ లైట్లు ఆపివేయడం జరుగుతుంది. అలాగే ఈ ఏడాది కూడా ఎర్త్ అవర్ పాటించేందుకు ప్రపంచం ఎదురుచూస్తోంది. ఇవాళ రాత్రి 8:30 నుంచి 9:30 గంటల వరకు ప్రపంచవ్యాప్తంగా దీనిని నిర్వహించనున్నారు. ఈమేరకు ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) కూడా రాష్ట్ర ప్రజలకు కీలక పిలుపునిచ్చారు.
ఎర్త్ అవర్ సందర్భంగా గంటపాటు లైట్లను ఆపేసే కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని సూచించారు. ప్రజలందరికీ ఆవాసమైన భూమిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ ఏడాది ప్రపంచ జల దినోత్సవం రోజునే ఎర్త్ అవర్ వచ్చిందని గుర్తు చేశారు. స్వర్ణాంధ్ర 2047 విజన్‌కు నీటి భద్రత, ఇంధన ఖర్చు తగ్గించడమే కీలకమని చెప్పారు. మనం చేసే చిన్న పనులే పెద్ద మార్పులకు దారి తీస్తాయనే విషయం గుర్తుంచుకోవాలని ఆయన వెల్లడించారు.