ఏపీలోని ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు(Earthquake) వచ్చాయి. ముండ్లమూరు మండలంలో భూమి సెకను పాటు కంపించింది. ముండ్లమూరు, సింగన్నపాలెం, మారెళ్లలో ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
కాగా శనివారం ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు వచ్చిన సంగతి తెలిసిందే. జిల్లాలోని ముండ్లమూరు మండలం శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, ముండ్లమూరు, వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడులో భూమి కంపించింది. దీంతో ముండ్లమూరు పాఠశాల నుంచి విద్యార్థులు.. ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. ఇక తాళ్లూరు మండలంలోనూ స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. తాళ్లూరు, గంగవరం, రామభద్రాపురం, ఇతర గ్రామాల్లో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. తాజాగా మరోసారి కూడా భూమి కంపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.