Earthquakes in Ongole area: ఆంధ్రప్రదేశ్‌లో స్వల్పంగా భూమి కంపించింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో రాత్రి 2 గంటలకు 2 సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. విజయ్ నగర్ కాలనీ, గాయత్రీ నగర్, వడ్డేపాలెం, భాగ్యనగర్, శ్రీరామపురం, సీఎస్ఆర్ శర్మ కాలేజ్ పరిసర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో స్థానిక ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.
స్వల్ప ప్రకంపనలు: రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రతతో కంపనాలు నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం పేర్కొంది. 10కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించింది. భూగర్భంలో చిన్నచిన్న కదలికలు వచ్చిన సమయంలో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని గతంలో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే.. ఈ భూప్రకంపనలకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఏడాదిలో ఇది రెండవసారి: ఈ ఏడాది మే నెలలో కూడా ఏపీలోని ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించాయి. పొదిలి, దర్శి, మండ్లమూరు మండలాల్లో సుమారు రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. ఆ సమయంలో కూడా స్థానిక ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. మరోవైపు దర్శి నియోజకవర్గంలో గత ఏడాది డిసెంబర్ నెలలో వరుసగా 4 రోజులపాటు భూమి కంపించింది. అయితే గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతంలోని భూగర్భంలో వచ్చిన మార్పులు కారణంగా భూమి కంపించినట్లు ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు గుర్తించారు.


