Homeఆంధ్రప్రదేశ్Data Centers : గూగుల్ దాహానికి పోలవరం నీళ్లా?.. సర్కారు తీరును ఎండగట్టిన ఈఏఎస్...

Data Centers : గూగుల్ దాహానికి పోలవరం నీళ్లా?.. సర్కారు తీరును ఎండగట్టిన ఈఏఎస్ శర్మ

విశాఖపట్నం  (తెలుగు ప్రభ): పోలవరం నీటిని డేటా సెంటర్లకు తరలిస్తామంటూ ప్రభుత్వ పెద్దలు చెబుతున్న విషయాన్ని కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ తప్పుబట్టారు. పోలవరం ప్రాజెక్టును నిర్మించింది డేటా సెంటర్ల అవసరాల కోసం కాదన్నారు. నిర్వాసితుల్నీ కనీసం పట్టించుకోకుండా భవిష్యత్తు అవసరాల కోసం ఆలోచించకుండా శాసన సభ సాక్షిగా నేతలు ఏవేవో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. నీటి అవసరాలు, ప్రస్తుత, భవిష్యత్ స్థితిగతుల్ని శర్మ ఆధారాలతో సహా వివరించారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా ఆయన లేఖ రాశారు. విశాఖ ప్రాంతంలో కూటమి ప్రభుత్వం ఎవర్నీ సంప్రదించకుండానే ఇష్టానుసారంగా డేటా సెంటర్లకు అనుమతిస్తుంటే దాని ప్రభావంతో పాటు నీటికొరతపై తాను ఇదివరకే ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చానని ఈఏఎస్ శర్మ గుర్తు చేశారు. ‘డేటా సెంటర్లకు ఏటా కావల్సినది 3.5 టీఎంసీలు మాత్రమే, కొందరు లేనిపోని విమర్శలు చేస్తున్నార’ని ప్రభుత్వం పేర్కొనగా, విశాఖ ప్రజల తరఫున ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

- Advertisement -

శాసన సభలో డేటా సెంటర్లపై ప్రస్తావిస్తూ ఉత్తరాంధ్రలో 6,500 మెగా వాట్ల డేటా సెంటర్లకు ప్రభుత్వం అనుమతించిందని, అందుకు కావాల్సిన సుమారు 3 టీఎంసీల నీటిని, పోలవరం ప్రాజెక్ట్ నుంచి ఉత్తరాంధ్ర పరిశ్రమలకు కేటాయించిన వాటా నుంచి ప్రభుత్వం ఇవ్వగలదని ప్రకటించారన్నారు. అయితే అమెరికాలో ఇటీవల గూగుల్ కంపెనీ నిర్మించిన డేటా సెంటర్ల నీటి ఉపయోగం వివరాల్ని పరిశీలించాలని, డేటా సెంటర్లలో ఒక యూనిట్ ఎలక్ట్రిసిటీ ఉపయోగిస్తే, ఉష్ణోగ్రతను తగ్గించడానికి, కనీసం 1.8 లీటర్ల నీరు కావాల్సి వస్తుందని, కానీ ప్రభుత్వం అనుమతించిన 6,500 మెగా వాట్ల డేటా సెంటర్లకు, కనీసం 3.74 టీఎంసీల నీరు అవసరమన్నారు.

ప్రస్తుతం విశాఖ ప్రజల నీటి అవసరాలు రోజుకు 400 మిలియన్ లీటర్లు అని.. అంటే 5.16 టీఎంసీలని శర్మ పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సిల్ట్ చేరుకుని, ముడసర్లోవ, మేఘాద్రిగెడ్డ వంటి స్థానిక రిజర్వాయర్లతో పాటు ఏలేరు కాలువ కెపాసిటీ తగ్గి, ప్రజలకు 326 ఎంఎల్‌డీ (4.2 టీఎంసీలు) మాత్రమేనని, అంటే నీటి కొరత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇదిలా ఉంటే 2040లో విశాఖ ప్రజల నీటి అవసరాలు 726 ఎంఎల్‌డీ (9.37 టీఎంసీ) వరకు పెరిగే అవకాశముందని, పోలవరం నీటిని లెక్కలోకి తీసుకుంటే 2040 నాటికి నీటి కొరత 400ఎంఎల్‌డీ (5.16 టీఎంసీలు)ఉండగలదన్నారు.

గతంలో, విశాఖ ప్రాంతంలో నీటి సమస్య, పరిశ్రమల కాలుష్యం గుర్తించి, కొత్తగా పరిశ్రమలకు అనుమతులు ఇవ్వకూడదనే నిర్ణయం తీసుకున్నారు. కానీ పరిశ్రమల యాజమాన్యాల ఒత్తిడికి లొంగి, ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని శర్మ మండిపడ్డారు. 2019లో అప్పటి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ ఎడమ కాలువ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల ప్రాజెక్ట్ నుంచి, ఉత్తరాంధ్ర జిల్లాలకు నీటిని చేకూర్చే ‘బాబూ జగ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును మంజూరు చేసిందని శర్మ గుర్తు చేశారు.

30లక్షల మందికి ఉపయోగం : ఆ ప్రాజెక్టు ద్వారా 30 లక్షలమంది ఉత్తరాంధ్ర ప్రజల అవసరాల కోసం నీటిని కేటాయించారని అదే కాకుండా 8 లక్షల ఎకరాల వ్యవసాయ భూములకు సాగు నీటిని కూడా కేటాయించారన్నారు. మిగిలిన 5.34 టీఎంసీల నీటిని మాత్రమే పరిశ్రమలకు కేటాయించారన్నారు. ఆ తర్వాత హెచ్‌పీసీఎల్ విస్తరణ,  బల్క్ డ్రగ్ పరిశ్రమలు, ఇతర రసాయన పరిశ్రమలు, ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వంటి పరిశ్రమలకు, నీటి సమస్యను విస్మరిస్తూ అనుమతులిచ్చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా పరిశ్రమలకు కావాల్సిన నీరు 5 టీఎంసీలని, అంటే పోలవరం నుంచి ఉత్తరాంధ్ర సృజల స్రవంతి ద్వారా ప్రభుత్వం కేటాయించిన 5.34 టీఎంసీల నటిలో మిగిలినది కేవలం 0.34 టీఎంసీలు మాత్రమేనన్నారు. అంటే 6,500 మెగా వాట్ల డేటా సెంటర్లకు కావాల్సిన 3.74 టీఎంసీల నీటిని పోలవరం ప్రాజెక్ట్ నుంచి ఇవ్వడం సాధ్యం కాదని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఒక వేళ ప్రభుత్వం ఆ నటిని డేటా సెంటర్లకు తరలిస్తే 12 లక్షలమంది ఉత్తరాంధ్ర ప్రజల నీటి అవసరాలకు భంగం కలుగుతుందని, అది ఎంతవరకు సబబమని శర్మ ప్రశ్నించారు.

6,500 మెగా వాట్ల డేటా సెంటర్లకు రాష్ట్ర ప్రభుత్వం 1,43,000 కోట్ల రూపాయలు ప్రజల నిధుల నుంచి రాయతీలు ఇస్తూ ఉంటే, కేంద్ర ప్రభుత్వం 6,18,000 కోట్ల రూపాయలు, ఆదేవిధంగా రాయితీలిస్తోంది. కానీ విశాఖ ప్రజలకు కలిగే ఉద్యోగావకాశాలు నామ మాత్రమేనని, ఆ ఖర్చులో, కేవలం 1 నిధులను, ఉత్తరాంధ్రలో విద్య, వైద్యా రంగాల అభివృద్ధి కోసం, సాగునీటి ప్రాజెక్టులు, ఇతర సమాజ సంక్షేమ కార్యక్రమాలపై ఖర్చు చేస్తే, ఉత్తరాంధ్ర ప్రజల పరిస్థితి మెరుగు పడుతుందని శర్మ హితవు పలికారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్ట్‌పై చేస్తున్న ఖర్చు రూ.30,437 కోట్లు అని, ఆ ప్రాజెక్ట్ కారణంగా లక్షకు పైగా ఆదివాసీలు నిర్వాసితులవ్వడమే కాకుండా, షెడ్యూల్డ్ ప్రాంతంలో వారికి ఉన్న రాజ్యాంగ పరమైన హక్కుల్ని కూడా పోగొట్టుకుంటున్నారన్నారు.

తక్కువ నష్టపరిహారం ఇచ్చి, ప్రభుత్వం వారి భూముల్ని స్వాధీనం చేసుకుని, అంత పెద్ద ఖర్చుతో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ అని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ నుంచి వచ్చే ప్రతి నీటి చుక్క నిర్వాసితులైన లక్షకు పైగా ఆదివాసీ కుటుంబాల బాధకు నిదర్శనమని ప్రభుత్వం గుర్తించాలన్నారు. అలా 3.74 టీఎంసీల నీటిని అమెరికాకు చెందిన లక్షల కోట్ల డాలర్ల లాభాలు గడిస్తున్న గూగుల్ వంటి కంపెనీలకు అతిచవకగా తరలించడం ఎంతవరకు సబబన్నారు. ఈ అంశాలేవీ ప్రభుత్వ పెద్దలు పరిశీలించలేదని, క్లిష్టమైన నీటి సమస్యను ఎదుర్కొంటున్న విశాఖ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వం డేటా సెంటర్ల విషయంలో పునః పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టును నిర్మించింది అమెరికా డేటా సెంటర్ల కోసం కాదనే విషయాన్ని సర్కార్ గుర్తెరగాలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News