బద్వేల్ (తెలుగు ప్రభ): ఎల్‌నినో కరువు ప్రభావంతో ప్రజలకు ఊరట కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ప్రజలు అర్ధాకలితో అవస్థలు పడకుండా సన్న బియ్యాన్ని తక్కువ ధరలో అందుబాటులో ఉంచింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
రాష్ట్ర ప్రభుత్వం.. రేషన్ కార్డుదారులకు, కార్డుకు 10 కేజీల చొప్పున స్టీమ్ రైస్(బీపీటీ) కేజీ రూ. 52కి, రా రైస్(బీపీటీ) రూ. 50కి మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు విక్రయించనుంది. ఈ మేరకు రైతు బజారు కేంద్రాల్లో, రైస్ మిల్లుల అవుట్లెట్ స్టోర్లలో విక్రయాలు చేపట్టాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. శనివారం బద్వేలు రైతు బజార్ కేంద్రంలో బద్వేలు రెవిన్యూ డివిజనల్ అధికారి ఏ.చంద్రమోహన్, డీఎస్ఓ కె. రఘురాం, డీసీసీ బ్యాంకు చైర్మన్, కడప అండ్ బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జి మంచూరు సూర్యనారాయణ రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల విజిలెన్స్ డైరెక్టర్ తుడిమిళ్ళ మురళీ కృష్ణ, బద్వేలు ఏఎంసీ చైర్ పర్సన్ నరిశెట్టి సుప్రజతో కలిసి విక్రయాలు ప్రారంభించారు.

ఈ మేరకు రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో బద్వేలు తహసీల్దార్, బద్వేల్ ఏ తిరుమల బాబు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ బద్వేల్ శివశంకర్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్, గీతా ప్రసాద్ రెడ్డి, రైస్ మిల్ యజమానులు పాల్గొన్నారు.

