Elephants: ఏపీలోని తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆహారం కోసం అడవి నుంచి బయటకు వచ్చిన రెండు గజరాజులు విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు విడిచాయి. నెరబైలు పంచాయతీ పరిధిలోని ఫారెస్ట్ బంగ్లా సమీపంలో సోమవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే: స్థానిక రైతులు అడవి పందుల బెడద నుండి తమ పంట పొలాలను కాపాడుకోవడానికి పొలాల చుట్టూ విద్యుత్ తీగలతో కంచె (Electric Fencing) ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి అడవి నుంచి వచ్చిన రెండు ఏనుగులు ప్రమాదవశాత్తు ఈ తీగలను తాకాయి. విద్యుత్ ప్రవాహం బలంగా ఉండటంతో ఆ మూగజీవాలు అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాయి.
అటవీ శాఖ చర్యలు: సోమవారం ఉదయం ఏనుగులు మృతిచెందడాన్ని స్థానికులు గమనించారు. దీంతో వెంటనే వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఫారెస్ట్ రేంజ్ అధికారులు ఏనుగులు విద్యుత్ షాక్ వల్లే మరణించాయని ధృవీకరించారు. ఈ ఘటనపై అటవీ శాఖ మరియు పోలీసులు సంయుక్తంగా కేసు నమోదు చేశారు. పంట రక్షణ కోసం అనుమతి లేకుండా విద్యుత్ తీగలు ఏర్పాటు చేసిన వారిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు.
Also read-Vijayawada: టీ20 వరల్డ్ కప్ సంబరాల్లో విషాదం.. అభిమాని తల పగలగొట్టిన పోలీసులు!
పర్యావరణ ప్రేమికులు ఆవేదన: విద్యుత్ తీగలు ఏర్పాటు ఉద్దేశపూర్వకంగా చేసిన పనా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వన్యప్రాణుల రక్షణ కోసం కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతం కావడంపై పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

