Ellapragada Subbarao| ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ పేరు మారింది. వైద్య విభాగంలో కీలక ఆవిష్కరణలు చేసిన ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు పేరు ఈ కళాశాలకు పెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైనా ప్రభుత్వ వైద్య కళాశాలకు ఎల్లాప్రగడ సుబ్బారావు పెట్టాలనే ప్రతిపాదనను పరిశీలించాలని వైద్య ఆరోగ్యశాఖను ఇటీవల సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఆదేశించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఏలూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి ఆయన పేరు పెడుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
కాలేజీకి పేరు మార్పుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Pawankalhyan) స్పందించారు. తాను చేసిన ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు చెబుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. “ప్రపంచానికి పలు ఔషధాలు అందించిన శాస్త్రవేత్త సుబ్బారావు స్వస్థలం భీమవరం. ఆయన రాజమహేంద్రవరంలో చదువుకున్నారు. కాబట్టి కొత్తగా ఏర్పాటు చేసిన ఏలూరు, రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఒక దానికి ఆయన పేరు పెడితే సముచితంగా ఉంటుంది. తొలి టెట్రాసైక్లిన్ యాంటీ బయోటిక్ ‘అరియోమైసిన్’ను సుబ్బారావు కనుగొన్నారు. బోద, క్షయ వ్యాధుల కట్టడికి ఔషధాలు రూపొందించారు. క్యాన్సర్ చికిత్సలో కీమోథెరపీకి వాడే తొలితరం డ్రగ్‌ను అభివృద్ధి చేశారు. ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు ఆయన పేరు పెడుతూ ఉత్తర్వులు జారీ చేసినందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు” అని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.