రాబోయే మూడు నెలల్లో ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నట్టు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (State Endowments Minister Anam Rama narayana Reddy) చెప్పారు. ఆదివారం ఆత్మకూరులో మంత్రి మీడియాతో మాట్లాడుతూ సంగంకు మంజూరై భవనాలు లేక ఆత్మకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్న ఐటిఐ కళాశాలను సంగంలోనే ప్రారంభించేందుకు చర్యలు చేపట్టామన్నారు.
లాంకో ఇండస్ట్రీస్ అధినేత రాజగోపాల్ రెడ్డి గారు వారి తండ్రి గారి జ్ఞాపకార్థం సంగంలో వున్న ఎనిమిది కోట్ల విలువైన భవనాలను ప్రభుత్వానికి అప్పగించారని, ఈ మేరకు లేఖను కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు అందజేసినట్లు తెలిపారు. మూడు నెలల్లో ఈ భవనాల్లో ఐటిఐ కళాశాల ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు. ఆత్మకూరులో వంద పడకల ఆసుపత్రిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిగా మారుస్తూ గతంలో ఉత్తర్వులు ఇచ్చామని, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ జిల్లా ఆస్పత్రిగా ప్రకటించేందుకు ఆత్మకూరుకు విచ్చేయున్నారని, విడతల వారీగా 50 పడకల చొప్పున ప్రతి ఏడాది పెంచుకుంటూ 200 పడకల ఆసుపత్రిగా ఆత్మకూర్ ఆస్పత్రిని అభివృద్ధి చేస్తామని మంత్రి ప్రకటించారు.
అలాగే ఇప్పటికే ఆత్మకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభమైన బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను అప్గ్రేడ్ చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని, ఆ మేరకు బాలికల రెసిడెన్షియల్ కళాశాల ఏర్పాటు కోసం భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి చెప్పారు. మున్సిపల్ శాఖ నుంచి ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు 53 కోట్ల నిధులు మంజూరైనట్లు మంత్రి చెప్పారు. రాబోయే మూడు నెలల్లో మంత్రులు నారా లోకేష్, పొంగూరు నారాయణ, సత్య కుమార్ యాదవ్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు.
ప్రజా ప్రతినిధులు, అధికారుల సహాయ సహకారాలతో ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.మంత్రి వెంట ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారు.