Intermediate Exam: పరీక్షల మూల్యాంకనంలో (Valuation) అధ్యాపకులు చేస్తున్న ఘోర తప్పిదాలు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. పేపర్లు దిద్దే సమయంలో కొందరు లెక్చరర్లు ప్రదర్శిస్తున్న తీవ్ర నిర్లక్ష్యం విద్యార్థులను కోలుకోలేని మానసిక వేదనకు గురిచేస్తోంది. తప్పులు చేసిన వారిపై విద్యాశాఖ బోర్డు తూతూమంత్రంగా చర్యలు తీసుకుని వదిలేస్తుండటంతోనే.. ఇలాంటి ఘటనలు పదే పదే పునరావృతమవుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
60 మార్కులు వస్తే 5 వేసిన లెక్చరర్!: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన కర్లపూడి కావ్య అనే విద్యార్థిని ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో లెక్చరర్ నిర్లక్ష్యానికి బలికావాల్సి వచ్చింది. కావ్యకు వృక్షశాస్త్రం (Botany) పరీక్షలో 60 మార్కులకు గాను 60 మార్కులు వచ్చాయి. అయితే సదరు సమాధాన పత్రాన్ని మూల్యాంకనం చేసిన లెక్చరర్.. ఓఎమ్మార్ (OMR) షీట్ బబ్లింగ్ సమయంలో తీవ్ర నిర్లక్ష్యంతో కేవలం 05 నమోదు చేశారు. దీంతో స్కాన్ చేసిన కంప్యూటర్ ఆమెకు కేవలం 5 మార్కులు వచ్చినట్లు చూపించింది. క్లాస్ టాపర్‌గా నిలవాల్సిన విద్యార్థినిని లెక్చరర్ నిర్లక్ష్యం కాస్తా ఫెయిల్ చేసింది.
నెల రోజుల పాటు నరకయాతన: ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 15న విడుదల కాగా.. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలు మే 13న విడుదలయ్యాయి. అంటే ఫలితాలు వచ్చినప్పటి నుంచి దాదాపు నెల రోజుల పాటు ఆ విద్యార్థినితో పాటు ఆమె కుటుంబం ఎంతటి మనోవేదనకు గురై ఉంటుందో ఊహించుకోవచ్చు. ఒకవేళ ఇలాంటి మానసిక ఒత్తిడిని తట్టుకోలేక విద్యార్థులు ఏదైనా విపరీత నిర్ణయం తీసుకుంటే దానికి బాధ్యులు ఎవరు? అని విద్యావేత్తలు, తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
Also read-Tirumala: ఒకే టికెట్‌పై 3 రోజులు శ్రీవారి దర్శనం.. ఈ నెల 21న ఆన్‌లైన్ టికెట్ల విడుదల!
నామమాత్రపు చర్యలతో భయం ఎక్కడ?: కావ్య పేపర్‌ను తప్పుగా మూల్యాంకనం చేసిన లెక్చరర్‌పై ఇంటర్ బోర్డు తీసుకున్న చర్యలు హాస్యాస్పదంగా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. సదరు లెక్చరర్‌కు కేవలం రూ.7,500 జరిమానా విధించి, మూడేళ్ల పాటు మూల్యాంకన విధులకు రాకుండా డిబార్ చేయనున్నట్లు బోర్డు ప్రకటించింది. “ఒక విద్యార్థిని జీవితాన్ని, భవిష్యత్తును పణంగా పెట్టి నెల రోజుల పాటు మానసిక నరకం చూపించిన లెక్చరర్‌కు ఇదా శిక్ష? ఇలాంటి నామమాత్రపు జరిమానాలతో తప్పు చేసే వారికి భయం ఎలా ఉంటుంది?” అని విద్యాసంఘాల నేతలు మండిపడుతున్నారు.

