ఢిల్లీలో నిర్వహించే రిపబ్లిక్ డే వేడుకల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక బొమ్మల శకటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పాల్గొననుంది. దీంతో ఏటికొప్పాక బొమ్మల విశిష్టత దేశవ్యాప్తంగా మరోమారు తెలియనుందని స్థానికులు హర్షంవ్యక్తంచేస్తున్నారు. మరోవైపు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోనే ఏటికొప్పాక ఉండటం గర్వించ వలసిన అంశంగా భావిస్తున్నట్టు, మన రాష్ట్రానికి దక్కిన ప్రత్యేక గౌరవం అని ఎంపీ డాక్టర్ సి.ఎం. రమేష్ పేర్కొన్నారు.
రాష్ట్రపతి, ప్రధాన మంత్రుల ప్రంశంసలు పొందడమే గాక, ఎన్నో అరుదైన రికార్డులు సాధించిన ఘనత ఏటికొప్పాక బొమ్మలకు ఉన్నాయి. తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు రూపొందించే మన ఏటికొప్పాక బొమ్మల శకటం గణతంత్ర దినోత్సవ వేడుకల కవాతు ప్రదర్శనలో ప్రత్యేకతను సంతరించుకోవడమే గాకుండా, ఉత్తమ శకటంగా ఎంపిక కావాలని ఆశిస్తూ, ఇందుకు కారణమైన అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాని ఎంపీ డాక్టర్ రమేష్ అన్నారు.
ఈ శకటంపై తమ నృత్య గాన ప్రదర్శనలు ఇచ్చే కళాకారుల బృందం విశాఖపట్నం నుంచి ఏపీ ఎక్స్ప్రెస్ రైలులో ఢిల్లీ చేరుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా తన కార్యాలయం నుంచి గతవారం చేసిందని అనకాపల్లి ఎంపీ తెలియజేశారు.