YS Jagan Planning To Meet Governer: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ గవర్నర్ సయ్యద్ అబ్ధుల్ నజీర్‌ను మరికొద్ది సమయంలో కలవనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు అమరావతిలోని రాజ్ భవన్‌కి వెళ్లి, గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం ఉంది. ఈ భేటీ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై జగన్ గవర్నర్‌కు వివరించనున్నారు.
ముఖ్యంగా తాము ‘అన్యాయంగా ఓడిపోయామని’, అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై, టీడీపీ నేతలపై ఆరోపణలు చేస్తూ, అధికార దుర్వినియోగం, సంక్షేమ పథకాల్లో జరుగుతున్న అవినీతిలపై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అలాగే వైసీపీ నేతలు, కార్యకర్తలపై పోలీస్ వ్యవస్థను వాడుకొని రాజకీయ కక్షసాధింపు చర్యలు తీసుకుంటున్నారన్న విషయాలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లే అవకాశముంది.
వైఎస్ జగన్, వారం రోజుల విరామం తర్వాత ఈరోజు బెంగళూరులోని తన వ్యక్తిగత పర్యటన ముగించుకొని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనతో కీలక నేతలు సమావేశమయ్యారు. పార్టీలోని కీలక పరిస్థితులపై, అధికారానికి దూరమైన తర్వాత వ్యూహాత్మకంగా ఎలా ముందుకెళ్లాలన్న దానిపై నేతలతో జగన్ చర్చించినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఏపీ లిక్కర్ స్కామ్, ప్రభుత్వ రంగ సంస్థల వద్దకు సీబీఐ దర్యాప్తులు వంటి అంశాలపై కూడా జగన్ నేతలతో చర్చించి, రాజకీయంగా దాని ప్రభావం తమకే అనుకూలంగా ఉంటుందని అభిప్రాయపడినట్టు సమాచారం.
ఈ అంశాలన్నిటినీ కలిపి, గవర్నర్‌కు ఒక సమగ్ర నివేదిక సమర్పించే యోచనతో జగన్ ముందుకు వెళ్లినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ భేటీ ద్వారా వైఎస్ జగన్ మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో తన ప్రభావాన్ని చూపించే ప్రయత్నం చేయబోతున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక గవర్నర్‌తో ఈ సమావేశం అనంతరం వైసీపీ తాజా వ్యూహాలు, ప్రతిపక్షంగా వ్యవహరించే తీరుపైనా స్పష్టత వచ్చే అవకాశముంది.


