Ambati Rambabu Arrest: సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ నేత బాజీ చౌదరి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అంబటి వ్యాఖ్యలను టీడీపీ మంత్రులు, నేతలు తీవ్రంగా ఖండించారు. కాగా, అంబటి ఇంటి వద్ద 6 గంటలకు పైగా టీడీపీ శ్రేణులు నిరసన, ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య అంబటిని వజ్రవాహనంలో పోలీసులు తరలించారు.
Also Read: https://teluguprabha.net/international-news/ukraine-moldova-power-outage-winter-crisis-2026/
సీఎం చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును శనివారం రాత్రి నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులోని నవభారత్ నగర్‌లోని నివాసం నుంచి అంబటిని తీవ్ర ఉద్రిక్తత మధ్య పోలీసు వాహనంలోకి ఎక్కించి తరలించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బాజీ చౌదరి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నల్లపాడు పోలీసులు అంబటిపై కేసు నమోదు చేయగా.. తీవ్ర ఉద్రిక్తతల నడుమ, పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి ప్రత్యేక వజ్రవాహనంలో తరలించారు. కాగా, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు కూడా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు సీఎం చంద్రబాబుపై అంబటి వ్యాఖ్యలను మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు, హోం మంత్రి అనిత, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్రంగా తప్పుబట్టారు. అంబటి వ్యాఖ్యలు ‘దుర్మార్గం’, ‘నీచం’ అని అభివర్ణించారు. అంబటి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అసలేం జరిగిందంటే..
తిరుమల లడ్డూల్లో నెయ్యి కల్తీ జరిగిందంటూ గుంటూరులో టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వివాదంపై అంబటి రాంబాబు స్పందించారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయగా.. తీవ్రమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గుంటూరులోని అంబటి నివాసం వద్దకు భారీగా చేరుకుని ఆందోళన నిర్వహించారు. దాదాపు 6 గంటలకు పైగా నిరసన చేపట్టడమే కాకుండా ఆయన ఇంటిపై రాళ్లు రువ్వడం, వాహనాలను ధ్వంసం చేయడం వంటి ఘటనలకు పాల్పడ్డారు.

