Sunday, January 18, 2026
Homeఆంధ్రప్రదేశ్Pinnelli Brothers: పిన్నెల్లి సోదరులకు 14 రోజుల రిమాండ్‌! జంట హత్యల కేసులో మాచర్ల కోర్టు...

Pinnelli Brothers: పిన్నెల్లి సోదరులకు 14 రోజుల రిమాండ్‌! జంట హత్యల కేసులో మాచర్ల కోర్టు సంచలన నిర్ణయం

Pinnelli Brothers Remanded: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైన టీడీపీ నేతల జంట హత్యల కేసులో మాజీ వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గురువారం మాచర్ల అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో ఈ సోదరులు లొంగిపోయారు.

- Advertisement -

న్యాయస్థానం వారిద్దరికీ 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో నిందితులుగా ఉన్న పిన్నెల్లి సోదరులను పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య నెల్లూరు జిల్లా జైలుకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ కేసు వివరాల్లోకి వెళ్తే… ఈ ఏడాది మే 24న సార్వత్రిక ఎన్నికల అనంతరం మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన టీడీపీ నేతలు జవ్విశెట్టి వెంకటేశ్వరరావు, జవ్విశెట్టి కోటేశ్వరరావు దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ జంట హత్యల కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై (A6), ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిపై (A7) కేసులు నమోదయ్యాయి.

అప్పటి నుంచి అరెస్ట్‌ కాకుండా ప్రయత్నిస్తున్న పిన్నెల్లి సోదరులు… ముందుగా హైకోర్టులో వేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్ రద్దవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా బెయిల్‌ పిటిషన్ వీగిపోవడంతో పాటు, రెండు వారాల్లోగా కచ్చితంగా లొంగిపోవాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి సోదరులు నేడు కోర్టులో లొంగిపోవాల్సి వచ్చింది.

రిమాండ్‌తో ఇక వారు జైలుకు వెళ్లడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసు తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News