Vamshi Health: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. జూలై 7వ తేదీ సోమవారం ఉదయం ఆయన ఆరోగ్యం హఠాత్తుగా విషమించడంతో, కుటుంబ సభ్యులు ఆయనను విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి అత్యవసరంగా తరలించారు. వంశీకి తీవ్రమైన శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తాయని, ఆయనకు ప్రస్తుతానికి ఐసీయూ వార్డులో వైద్య సేవలు అందిస్తున్నారని తెలుస్తోంది. వంశీ ఆరోగ్య పరిస్థితిని గమనిస్తున్న వైద్య బృందం ప్రాథమికంగా ఆయనకు శ్వాస సంబంధిత చికిత్సలు, స్కానింగ్‌లు, పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని, పూర్తిగా కోలుకునేందుకు కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి రావొచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై త్వరలోనే అధికారికంగా హాస్పటల్ నుంచి ఆరోగ్య బులెటిన్ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇటీవలే వంశీ ఫిబ్రవరి 13న సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టయి, ఆపై గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి ఘటన సహా మొత్తం 11 కేసుల్లో ప్రధాన నిందితుడిగా నిలిచారు. అయితే, అన్ని కేసుల్లోనూ వంశీకి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుండి విడుదలయ్యారు. ముఖ్యంగా అక్రమ మైనింగ్ కేసులో ఆయనకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా, ప్రభుత్వం ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును నిలబెట్టి బెయిల్ రద్దును తిరస్కరించింది. అంతేకాకుండా, నకిలీ ఇళ్ల పట్టాల కేసులో కూడా వంశీకి కోర్టు శరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో లక్ష రూపాయల వ్యక్తిగత బాండ్, ఇద్దరు షూరిటీలు, అలాగే వారానికి రెండు సార్లు పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలి అన్న షరతులు విధించబడ్డాయి.
ఇప్పటి పరిస్థితుల్లో వంశీ ఆరోగ్యం పట్ల రాజకీయవర్గాలతో పాటు అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అరెస్టులు, కేసులు, కోర్టు విచారణలు వంటి విపత్కర సంఘటనల మధ్య ఆయన శారీరక, మానసిక ఒత్తిడి తీవ్రంగా పెరిగిందని ఆయన సన్నిహితులు భావిస్తున్నారు. వంశీ త్వరగా కోలుకోవాలని ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు ఆశిస్తున్నారు.


