ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మన్యం పర్యటనలో నకిలీ ఐపీఎస్ హల్ చల్ చేయడంపై హోంమంత్రి అనిత(Anitha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే దీనిపై విచారణ చేపట్టాలని ఆదేశించారు. పార్వతీపురం జిల్లా మన్యంలో పవన్ పర్యటించిన సంగతి తెలిసిందే. వై కేటగిరీ భద్రత ఉన్న పవన్ పర్యటనలో బలివాడ సూర్యప్రకాశరావు అనే వ్యక్తి ఐపీఎస్ యూనిఫాం వేసుకుని పవన్ చుట్టూ తిరిగారు. అంతేకాకుండా ఈ నకిలీ అధికారికి మిగిలిన అధికారులు, పోలీసులు సెల్యూట్ కొట్టి, ఫోటోలు దిగారు.
ఈ సంఘటన మీడియాలో వైరల్ కావడంతో అనిత స్పందించారు. పవన్ కళ్యాణ్ భద్రతలో జరుగుతున్న లోపాలను దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో నకిలీ ఐపీఎస్ సూర్యప్రకాష్ అనే వ్యక్తిని విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.