Wednesday, March 26, 2025
Homeఆంధ్రప్రదేశ్Jagan: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి: YS జగన్

Jagan: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి: YS జగన్

వైయస్సార్‌ జిల్లా లింగాల మండలంలో భారీ ఈదురుగాలులు, అకాల వర్షాలతో నష్టపోయన పంటలను మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించారు. తాతిరెడ్డి పల్లె, కోమన్నూతలలో పర్యటించిన వైయస్‌ జగన్‌ అక్కడ కూలిన అరటితోటలు పరిశీలించారు. ఆ రైతులతో మాట్లాడి, వారికి జరిగిన నష్టాన్ని ఆరా తీశారు. లింగాల మండలంలో ఈదురు గాలులు, అకాల వర్షాలతో దాదాపు 4 వేల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా.రైతులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన శ్రీ వైయస్‌ జగన్‌.. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..:

- Advertisement -

మానవతా దృక్పథంతో వ్యవహరించండి:
చంద్రబాబునాయుడుగారు అధికారంలోకి రాగానే, పంటలకు సంబంధించి 2023–24 ప్రీమియమ్‌ కట్టకపోవడంతో ఖరీఫ్‌ రైతులు నష్టపోయారు. ఆ తర్వాత 2024–25కు సంబంధించిన ప్రీమియమ్‌ కూడా ఆయన కట్టలేదు. దీన్నే మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాం. అసలు ఉచిత పంటల బీమా ఉందా? లేదా? దశల వారీగా ఎత్తేస్తామన్నారు. ఈ ప్రభుత్వం అదే పని చేస్తోందా? చంద్రబాబుగారి పుణ్యాన ఇప్పటికే అనేక పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ధాన్యం రంగు మారింది. అన్ని రకాల పంటలు నష్టపోయాయి. మొక్కజొన్న, జొన్న పంటలకు కూడా భారీగా నష్టం వాటిల్లింది.

వరసగా రెండేళ్ల ఖరీఫ్‌ సీజన్‌లో అదే జరిగింది. ప్రభుత్వం వెంటనే మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. పంటలకు ఇన్సూరెన్స్‌ కట్టాలి. ఈ–క్రాప్‌ పక్కాగా నమోదు చేయాలి. ప్రతి రైతు పంటల వివరాలు ఈ–క్రాప్‌ కింద నమోదు చేసి, నష్టం జరిగితే వారికి ఇన్సూరెన్స్‌ వచ్చేలా చూడాలి. ఎవరూ ఇన్సూరెన్స్‌ కట్టలేదన్న పరిస్థితి ఉత్పన్నం కాకూడదు.

పెట్టుబడి సాయం లేదు:
రైతులకు పెట్టుబడి సాయం కూడా ఇవ్వడం లేదు. గతంలో మా ప్రభుత్వ హయాంలో రూ.13,500 ఇచ్చాం. చంద్రబాబుగారు తాము అధికారంలోకి వస్తే రూ.26,000 ఇస్తానన్నాడు. కానీ, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇంకా సున్నా వడ్డీ పంట రుణాలకు మంగళం పాడారు. రైతులకు సున్నా వడ్డీ మొత్తం చెల్లించలేదు.

నిరుపయోగంగా కోల్డ్‌ స్టోరేజీ:
పులివెందులలో అరటి సాగు ఎక్కువ. రాష్ట్రంలో నెంబర్‌ వన్‌. ఆ రైతులకు మేలు చేయడం కోసం ఇక్కడ రూ.25 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ కోల్డ్‌ స్టోరేజీ ఏర్పాటు చేశాం. ఎన్నికలకు ముందే దాన్ని ప్రారంభించాం.
కానీ, ఈ ప్రభుత్వం దారుణంగా వ్యవహరించి, టెండర్‌ పిల్చి యూజర్‌ ఏజెన్సీకి అప్పగించడం లేదు. అంత కపటప్రేమ రైతులపై ఉంది. ఈ కోల్డ్‌ స్టోరేజీ సామర్థ్యం 500 మెట్రిక్‌ టన్నులు.
దాన్ని టెండర్‌ ద్వారా యూజర్‌ ఏజెన్సీకి అప్పగిస్తే రైతులకు మేలు జరిగేది. కానీ, ఆ పని చేయకుండా ఈ కోల్డ్‌ స్టోరేజీని వాడుకోకుండా వదిలేశారు. ఇప్పుడు యూజర్‌ ఏజెన్సీ ఉండి ఉంటే, వారు పంట కొనుగోలు చేసేవారు. మరోవైపు రైతులు తమ పంటను ఇక్కడ దాచుకునే వీలుండేది.

దారుణంగా పతనమైన పంటల ధర:
రాష్ట్రంలో వర్షాలు, ఈదురుగాలులలో ఇప్పటికే పంటలకు తీవ్ర నష్టం జరగ్గా, మరోవైపు ధరలు కూడా దారుణంగా పడిపోయాయి. నెల క్రితం రూ.26వేల ధర ఉంటే, ఇప్పుడు రూ.9 వేలకు పడిపోయింది. అయినా కొనుగోళ్లు లేవు. ఇంకా కొన్ని చోట్ల రూ.6 వేలకు పడిపోయిం. దిప్రభుత్వం ఎక్కడా రైతును పట్టించుకోవడం లేదు. మిర్చిది అదే పరిస్థితి. ధాన్యం కొనుగోలుదీ అదే పరిస్థితి. టన్ను ధాన్యంలో రైతులు టన్నుకు రూ.300 నుంచి రూ.400 వరకు నష్టపోతున్నారు. మిర్చి రూ.11,800 కు కొంటామన్నారు. ఒక్క కేజీ కూడా కొనలేదు. పెసరు, శనగలు, మినుములు, కందులు.. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. గతంలో చీనీ పంటకు వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో టన్నుకు లక్ష వరకు వచ్చింది. స్యూట్‌ (కమిషన్‌) లేకుండా రైతులకు మేలు చేయగా, ఈరోజు అదే ధర కేవలం రూ.23 వేలు, రూ.18 వేలు, రూ.15 వేలు మాత్రమే.

ప్రతి రైతుకు ఇదే నా భరోసా:
4 వేల ఎకరాల రైతులకు ఒకటే భరోసా ఇస్తున్నాను. ప్రభుత్వంపై ఒత్తిడి కోసమే నా ఈ పర్యటన. చంద్రబాబునాయుడుగారు కచ్చితంగా ఇక్కడి రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలి. ఇన్సూరెన్స్‌ సొమ్ము కూడా రావాలి. అది రాకపోతే, వచ్చేది మన ప్రభుత్వమే. చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. మూడేళ్లు ఓపిక పట్టండి. వచ్చేది మన ప్రభుత్వమే. మన ప్రభుత్వం ఏర్పడగానే నెల రోజుల్లోనే రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తాం. అలాగే రైతులకు రాని ఇన్సూరెన్స్‌ కూడా కల్పిస్తాం. ప్రతి రైతు ముఖంలో సంతోషం కనిపించేలా చేస్తాం. అవే కాకుండా, ప్రతి రైతుకు 2023లో ఇచ్చినట్లుగా రూ.50వేలు ఇస్తాం. ఇది ప్రతి రైతుకు భరోసా ఇస్తూ చెబుతున్నానంటూ, పార్టీ తరపున కూడా రైతులకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తామని వైయస్‌ జగన్‌ వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News