High Speed Bike Accident Vizag: పరీక్షల్లో ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకోవడం, ప్రేమలో విఫలమైతే రైలు కింద పడి చనిపోవడం, ఇంట్లో తల్లిదండ్రులు మందలించినా ఉరేసుకోవడం.. ఆఖరికి సెల్‌ఫోన్, టీవీ రిమోట్ విషయంలో కూడా గొడవపడి నిండా ఇరవై ఏళ్లు కూడా లేని యువత తనువు చాలించడం ఘటనలు నిత్యం చోటుచేసుకుంటున్నాయి. అయితే తమ బిడ్డ అడిగింది కూడా కొనివ్వకపోతే ఇలాగే తమకు దక్కకుండా పోతాడేమోనని భయపడిన తల్లిదండ్రులు అప్పు చేసి మరీ కొడుకు ముచ్చట తీర్చారు. అయినా వారికి కడుపు కోత తప్పలేదు. ఇంతకీ ఏం జరిగిందంటే..
వాళ్లది దిగువ మధ్యతరగతి కుటుంబం. రోజూ ఆటో నడిపితే వచ్చే ఐదారొందలతోనే ఇల్లు గడుస్తుంది. అయినా తమ కొడుకుని గారాబంగా పెంచారు. చదివించారు. అడిగింది లేదు అనకుండా కడుపు కట్టుకుని అప్పోసొప్పో చేసి బిడ్డ డిమాండ్లను నెరవేర్చారు. కానీ ఈ సారి వారి తాహతుకి మించి కోరిక కోరాడు సుపుత్రుడు. తమ వాళ్ల కాదు అని చెప్పినా వినిపించుకోలేదు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి గమనించలేదు. అలిగి మొండిపట్టుపట్టాడు. దీంతో చేసేదేం లేక లక్షల అప్పు చేసి మరీ విజయదశమి రోజు అతను అడిగింది ఇచ్చారు. దీంతో సంబరపడిన కొడుకు సంతోషం మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/ap-ration-cards-ekyc-mandatory-cancellation-warning/
ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరావు విశాఖపట్నం మహారాణిపేటలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతని కుమారుడు హరీశ్ (19) ఇంటర్ వరకు చదివి.. ప్రస్తుతం ఖాళీగా ఇంటి దగ్గరే ఉంటున్నాడు. కాగా, యుక్త వయసులో ఆరాటం అతడిని బైక్‌పై తిరిగేలా ప్రేరేపించింది. అది కూడా సాదా సీదా బైక్ కాదు. కాస్ట్లీ బైక్. కొద్దిరోజుల నుంచి రూ. 3 లక్షల విలువైన బైక్ కొనివ్వాలని తండ్రిని హరీశ్ అడుగుతున్నాడు. బైక్ కొనేంత స్థోమత లేదని తండ్రి చెప్పినప్పటికీ హరీశ్ అర్థం చేసుకోలేదు. తల్లిదండ్రుల మీద అలిగి మొండికి దిగాడు. దీంతో తమ కొడుకు తమకు దక్కడేమో.. ఏమైనా అఘాయిత్యం చేసుకుంటాడేమోనన్న భయంతో తల్లిదండ్రులు.. రూ. 3 లక్షలు అప్పు చేసి మరీ దసరా రోజున శ్రీనివాసరావు బైక్ కొని కొడుక్కి ఇచ్చాడు.
ఈ క్రమంలో బైక్ కొన్న సంతోషంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో హరీశ్ బయటికి వెళ్లాడు. టిఫిన్ చేయడానికి తన స్నేహితుడు వినయ్‌తో కలిసి కొత్త బైక్‌పై ద్వారకానగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు చేరుకున్నాడు. టిఫిన్ తిన్నాక వినయ్‌ను ఇంటి వద్ద దిగబెడతానని చెప్పి.. హరీశ్ మితిమీరిన వేగంతో బైక్‌ను నడిపాడు. దీంతో సిరిపురం దత్ ఐలాండ్ టర్నింగ్ వద్ద బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో హరీశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం హరీశ్ మృతి చెందాడు. ఇక తన స్నేహితుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
దీంతో హరీశ్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బైక్ కొనివ్వకపోతే తమకు దక్కడేమో అనుకున్న కొడుకు.. అడిగింది కొనిచ్చినా తమకు దక్కలేదని విలపించారు. అయితే ఈ ఘటన తల్లిదండ్రులను ఈ తరం యువత అర్థం చేసుకునే తీరు, వారి మానసిక స్థితి, నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలనే ఆరాటం, ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించడం లాంటి చర్యలకు అద్దం పడుతోంది.


