Father Kills Daughter: తమ ప్రేమకు అడ్డు వస్తుందనే కారణంతో ప్రియుడితో కలిసి కన్న కూతురేతల్లిని చంపి ఇంట్లోనే పాతిపెట్టిన ఘటన మరువకముందే మరో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం మోజులో పడి కన్న కూతురినే కడ తేర్చాడు కసాయి తండ్రి. ఏపీలోని మార్కాపురం జిల్లాలో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది.
మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలోని ఉత్తరం బజారులో సభ్య సమాజం తల దించుకునే సంఘటన చోటు చేసుకుంది. మోటుకట్ల శివారెడ్డి తన ప్రియురాలు షేక్ బాజిబీతో కలిసి తన కన్న కూతురు తులసి వందన(9)ను కిరాతకంగా చంపేసాడు. శివారెడ్డి, బాజిబీల మధ్య ఉన్న వివాహేతర సంబంధం గురించిన తులసి వందన.. తల్లి ఈశ్వరమ్మతో పాటు బంధువులకు చెబుతుందనే కారణంతో, ఆ చిన్నారిని చంపాలని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే ప్రియురాలు బాజిబీ ఇంట్లోకి తీసుకుని వెళ్లి నోట్లో గుడ్డలు కుక్కి,కాళ్లు చేతులు కట్టేసి ఇనుప తీగతో గొంతు బిగించి ఊపిరి ఆడకుండా చేసి అత్యంత క్రూరంగా చంపేశారు.
కూతురు ఇంట్లో కనిపించక పోవడంతో ఆందోళన చెందిన ఈశ్వరమ్మ బంధువులతో కలిసి బాజిబీ ఇంట్లో వెతికారు. కన్న కూతురు శవమై విగతజీవిగా పడి ఉండటంతో తల్లి రోదనలు మిన్నంటాయి. బంధువుల సాయంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు శివారెడ్డిని అదుపు లోకి తీసుకున్నారు. అప్పటికే పరారైన బాజిబీని కూడా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.
శివారెడ్డిని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా పాప బంధువులు నిందితుడిని స్టేషన్ వరకు చెప్పుతో కొట్టుకుంటూ వెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

