Fee Reimbursement Delay: మహిళా క్రికెట్ ప్రపంచకప్ గెలుచుకున్న బృందంలోని సభ్యురాలైన శ్రీచరణికి రూ.2.5 కోట్ల నగదు ప్రోత్సాహకం, వెయ్యి గజాల ఇంటి స్థలం, గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చారు. అదంతా బాగానే ఉంది. క్రీడల్లో రాణించేవారిని గుర్తించడం మంచిదే. కానీ, మరోవైపు రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్నే నమ్ముకుని కళాశాలల్లో చేరిన వేలాది మంది విద్యార్థుల గోడు మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించడం లేదా? ఇప్పటికే వైద్యకళాశాలలను పీపీపీ పద్ధతిలో నిర్వహిస్తామని చెప్పడంపై కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చెలరేగుతున్నాయి.
ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు
మరోవైపు ఇప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వం నుంచి కళాశాలల యాజమాన్యాలకు డబ్బులు రాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచుతున్నారు. ‘మాకు ప్రభుత్వం నుంచి రాలేదు… ముందు మీరు చెల్లిస్తేనే సెమిస్టర్ పరీక్షల ఫీజు కట్టించుకుంటాం… లేకపోతే ఆగిపోవాల్సిందే’ అంటూ కళాశాలల యాజమాన్యాలు మొండిపట్టు పడుతున్నాయి.
ముఖ్యంగా ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు , ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కళాశాలల యాజమాన్యాలు ఈ విషయంలో మరీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. తిరుపతిలో ఓ యూనివర్సిటీ విషయంలో విద్యార్థి సంఘాలు ఉద్యమించేవరకు విషయం వెళ్లింది. ఉమ్మడి ఉభయ గోదావరి, గుంటూరు, విజయనగరం తదితర జిల్లాల్లోని కొన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్ కళాశాలలు ఫీజులు కట్టాల్సిందేనంటూ విద్యార్థులకు సమాచారం పంపుతున్నాయి. ఇప్పటికిప్పుడు వేలు, లక్షల్లో ఉన్న ఫీజు చెల్లించడం విద్యార్థుల తల్లిదండ్రులకు తలకు మించిన భారం అవుతోంది. రోజూ నోట్లోకి నాలుగువేళ్లు వెళ్లడమే కష్టంగా ఉన్న వారు.. కళాశాలల యాజమాన్యాల చుట్టూ తిరిగినా ఫలితం ఉండట్లేదు. చివరకు కొందరైతే బయట వడ్డీలకు తెచ్చి కట్టే ప్రయత్నంలో పడ్డారు.
కొండలా పేరుకుపోయిన బకాయిలు
జగన్ ప్రభుత్వ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బుల్ని విద్యార్థుల తల్లుల బ్యాంకుఖాతాల్లో జమ చేసే విధానంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో కూటమి ప్రభుత్వం నేరుగా కళాశాలల బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమచేయాలని నిర్ణయించింది. విధానం ఏదైనా పాతవి, కొత్తవి కలిపి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.6,500 కోట్లు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు రూ.1300 కోట్లు విడుదల చేసినట్లు సమాచారం. ఇంకా రూ.5వేల కోట్లకు పైగా బకాయి ఉండడంతో యాజమాన్యాలు సైతం తాము కళాశాల నిర్వహణ ఎలా చేయాలని తలపట్టుకుంటున్నాయి. అధ్యాపకుల జీతాలకే డబ్బులు లేని పరిస్థితి ఎదురవుతోందని వాపోతున్నాయి.
మంత్రి లోకేశ్ ఆదేశాలు భేఖాతరు
చదువులు పూర్తి చేసిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో సంబంధం లేకుండా ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశించినా కళాశాల యాజమాన్యాలు పాటించడం లేదు. అధికార పార్టీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు గుంటూరులో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలలో ఫీజు బకాయిలు కట్టకపోతే సెమిస్టర్ పరీక్షల ఫీజులకు అనుమతించబోమని ఆదేశాలు జారీజేశారు. విద్యార్థి సంఘాలు కళాశాల ఎదుట ధర్నాకు దిగగా యాజమాన్యం దిగివచ్చి వారికి పరీక్ష ఫీజు చెల్లించడానికి అనుమతిచ్చింది.
జగన్ ప్రభుత్వ హయాంలో కన్వీనర్ కోటా ఫీజులను రూ.35వేల నుంచి రూ.70వేల వరకు నిర్ధారించారు. కూటమి ప్రభుత్వం దాన్ని రూ.1.05 లక్షలకు పెంచింది. అయితే 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఇప్పటివరకు పూర్తిస్థాయిలో ఫీజు బకాయిలు విడుదల కాలేదు. తొలుత మొదటి సెమిస్టర్, తర్వాత రెండు, మూడో సెమిస్టర్ ఫీజులు కట్టాలని యాజమాన్యాలు పట్టుబడుతున్నాయి. లేకపోతే పరీక్షలకు పంపబోమని చెబుతున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో దాదాపు లక్ష మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ రావాల్సి ఉంది.
గత ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.2,800 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉండగా.. వాటిని విడుదల చేసే సమయంలో ఎన్నికల ముంగిట కావాలనే చేస్తున్నారంటూ టీడీపీ నాయకులు కోర్టుకెక్కారు. దాంతో ఆ నిధుల విడుదల ఆగిపోయింది. ఇప్పుడు పాత, కొత్త బకాయిలు కలిపి పెద్ద మొత్తంలో పేరుకుపోవడంతో వేలాది మంది విద్యార్థులు చదువులు పూర్తయినా చేతుల్లోకి సర్టిఫికెట్లు రాక, ఉద్యోగాల ఇంటర్వ్యూలకు వెళ్లలేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు.
ఫీజులు చెల్లించనిదే తాము సర్టిఫికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని యాజమాన్యాలు తెగేసి చెబుతున్నాయి. ఉద్యోగాలకు గానీ, ఉన్నత విద్యకు గానీ వెళ్లాలంటే సర్టిఫికెట్లు లేకుండా కుదరదు. ఇలా తమను త్రిశంకుస్వర్గంలో ఉంచడం ప్రభుత్వానికి సబబు కాదని, అందువల్ల తక్షణమే స్పందించి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని, లేకుంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి.


