Ysrcp :వైసీపీకి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి.గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి ఆ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. వైసీపీని వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. కొందరు వైసీపీ నేతలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తుండగా, మరి కొందరు నేతలు వైసీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలు అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. తాజాగా మరో కీలక నేతపై కేసు నమోదు కావడం సంచలనంగా మారింది.పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపాయి. రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా, శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ఆయన మాట్లాడారంటూ ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఏం జరిగింది?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 22న పెదవేగి మండలం కొండలరావుపాలెం ఘటనకు సంబంధించి పేర్ని నాని సహా వైకాపా నేతలు ఏలూరు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. అనంతరం మీడియా సమావేశంలో నాని మాట్లాడుతూ.. “మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిని చంపుతారా? చంపితే నియోజకవర్గంలో వెయ్యి మంది అబ్బయ్య చౌదరిలు పుడతారు” అని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు స్థానికంగా రెండు వర్గాల మధ్య విద్వేషాలు పెంచేలా ఉన్నాయని, శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొంటూ దెందులూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేత రవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పేర్ని నానిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Ys. Jagan : అక్రమాస్తుల కేసులో జగన్‌కు బిగ్ షాక్
ఎందుకు ఈ కేసు?
రాజకీయ నాయకుల మాటలు తరచుగా వివాదాస్పదంగా మారుతుంటాయి. అయితే, నేరుగా హింసను ప్రేరేపించేలా, వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టించేలా ఉన్న వ్యాఖ్యలపై కేసులు నమోదు కావడం సాధారణంగా జరుగుతుంది. పేర్ని నాని వ్యాఖ్యలు కూడా అదే కోవలోకి వస్తాయి. ఒక నాయకుడిని చంపేస్తారని వ్యాఖ్యానించడం, దానికి ప్రతిగా వేలమంది పుడతారని చెప్పడం విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉందని ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు. ఈ కేసు రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీసింది.


