Fire accident: తిరుపతి రైల్వేస్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్టేషన్ వెలుపల లూప్‌లైన్‌లో ఆగి ఉన్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్, హిసార్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రెండు బోగీలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఫైరింజన్ల సహాయంతో మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రైళ్లలో మంటలు వ్యాపించడంతో స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

తిరుపతి రైల్వే యార్డులోని హిసార్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగడంతో బోగీ పూర్తిగా కాలిపోయింది. రాజస్థాన్ నుంచి హిసార్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి రైల్వేస్టేషన్‌కు ఉదయం 11.50 గంటలకు చేరుకుంది. ప్రయాణికులు దిగిన తర్వాత యార్డులోకి వెళ్తున్న సమయంలో ఇంజిన్ వెనకవైపు ఉన్న బోగీలో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్ జనరేటర్ బోగీలోకి మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

దీంతో హుటాహుటిన ఫైర్ సిబ్బంది వచ్చేలోపే హిసార్ ఎక్స్‌ప్రెస్ బోగీ పూర్తిగా కాలిపోగా.. రాయలసీమ రైలు బోగీ మాత్రం స్వల్పంగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం లేకపోవడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న రైల్వే పోలీసులు ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.


