Tuesday, December 9, 2025
HomeTop StoriesInfant Deaths: నెల రోజుల్లో ఐదుగురు చిన్నారులు మృతి.. అంతుచిక్కని కారణాలు!

Infant Deaths: నెల రోజుల్లో ఐదుగురు చిన్నారులు మృతి.. అంతుచిక్కని కారణాలు!

Infant Deaths in AP: అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలంలోని దార్రెల పంచాయతీలో వరుస శిశు మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఐదుగురు పసికందులు అంతుచిక్కని కారణాలతో మృతి చెందారు. దీంతో స్థానిక గిరిజనులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

- Advertisement -

నెల రోజుల్లో ఐదుగురు మృతి: దార్రెలగ్రామానికి చెందిన శ్రీకాంత్, రాజేశ్వరి దంపతుల 4 నెలల చిన్నారి హర్షశ్రీ శనివారం మృతి చెందాడు. మూడు రోజులుగా పాలు తాగకపోవడంతో నీరసించిన చిన్నారిని శుక్రవారం స్థానిక సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. పరిస్థతి విషమించడంతో అక్కడి వైద్యులు పాడేరులోని జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం 7 గంటలకు శిశువు మరణించాడు. ఈ చిన్నారితో పాటుగా ఇదే గ్రామానికి చెందిన 4 నెలల లలితశ్రీ సైతం ఈ నెల 11న మృతి చెందింది. చీవుకుచింత గ్రామానికి చెందిన రెండు నెలల బాబు ఈ నెల 13న మృతి చెందాడు. తలింబ గ్రామంలో ఈ నెల 5న రెండు నెలల పాప మృతి చెందగా.. ఇదే గ్రామానికి చెందిన నెల రోజుల బాబు గత నెల 29న మృతిచెందాడు.

Also Read:https://teluguprabha.net/andhra-pradesh-news/today-ap-weather-updates/

అంతుచిక్కని కారణాలు: ఆరోగ్యంగా ఉన్న చిన్నారులు ఉన్నట్టుండి శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ మరణిస్తున్నారు. పాలు తాగడం మానేసి, చికిత్స పొందుతూ మృతి చెందుతుండటం తల్లిదండ్రుల్లో తీవ్ర విషాదాన్ని నింపుతోంది. పుట్టిన కొద్ది నెలలకే పిల్లలు చనిపోవడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. అయితే వైద్యులు మాత్రం చిన్నారులలో ఇన్‌ఫెక్షన్‌ వల్లగానీ.. లేదా మెదడు సంబంధిత సమస్యలు ఉన్నప్పుడుగానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

చర్యలు తీసుకోవాలని గిరిజనుల విజ్ఞప్తి: శిశు మరణాల సంఖ్య పెరుగుతుండటంతో స్థానిక గిరిజనులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. చిన్నారుల మరణాలకు గల కారణాలను తెలుసుకుని.. తదుపరి చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను కోరారు. ఈ వరుస మరణాలపై ఆరోగ్య శాఖ తక్షణమే స్పందించి.. గిరిజన గ్రామాల్లో ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News