Five Died Due to Thunderbolt: రాష్ట్రంలో గత రెండ్రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఈ రెండు రోజుల్లో పిడుగుపాటుతోనే మొత్తం 9 మంది చనిపోవడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో ఈ ఒక్కరోజే ఐదుగురు మృత్యువాత పడ్డారు.
రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల సంభవించిన పిడుగుపాటు కారణంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సోమవారం ఐదుగురు చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లాలోని పుల్లలచెరువు మండలం మొక్కజొన్న పరిశ్రమ వద్ద పిడుగు పడటంతో కన్నయ్య అనే కూలీ మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. దర్శి మండలం చామంతపూడిలో పిడుగు పడి ఆవుల మల్లికార్జున్(22) అనే యువకుడు చనిపోయాడు.
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలో పిడుగు పడి నాగయ్య అనే వ్యక్తి మరణించగా.. మిగతా మృతుల్లో కొందరు బీహార్‌కు చెందిన కూలీలుగా పోలీసులు గుర్తించారు.
కాగా, ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుకు తల్లీకూతుళ్లు మృతి చెందారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఓ వృద్ధురాలు, ఓ పురుషుడు ప్రాణాలు కోల్పోయారు.
రానున్న రోజుల్లో ఏలూరు, పాలనాడు, ప్రకాశం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలు ముఖ్యంగా పొలాల్లో ఉండేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

