Yarada Beach Foreigner Died: ఆదివారం కావడంతో విశాఖ యారాడ బీచ్‌లో సరదాగా గడిపేందుకు వస్తే ప్రాణాలే పోయాయి. ఇటలీ నుంచి వచ్చిన పర్యాటకుల్లో ఇద్దరు అలల తాకిడికి కొట్టుకుపోయారు. సముద్రంలో ఈతకు దిగిన ఇద్దరు విదేశీయులు నీటిలో గల్లంతయ్యారు. గమనించిన లైఫ్ గార్డ్స్ వెంటనే అప్రమత్తమై నీళ్లలో కొట్టుకుపోతున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. వారిలో ఒకరు మృతి చెందగా.. మరొకరు మృత్యువు నుంచి బయపడ్డారు.
ఇటలీకి చెందిన మొత్తం 16 మంది పర్యాటకులు యారాడ బీచ్ అందాలను చూసేందుకు వచ్చారు. కాగా, ఆ ప్రాంతంలో లోతు ఎక్కువగా ఉందని.. ఈతకు అనుకూలం కాదని మెరైన్ పోలీసులు, లైఫ్ గార్డ్స్ హెచ్చరిస్తున్నప్పటికీ వారు పట్టించుకోకుండా సముద్రంలో దిగి ఈత కొడుతున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఎగిసిపడిన అలల ధాటికి ఇద్దరు కొట్టుకుపోయారు. వారిలో ఒకరు సీపీఆర్ చేసినా బతకలేదు. మరొకరి ప్రాణాలను రక్షించగలిగారు. ఘటనపై న్యూ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గత కొంతకాలంగా యారాడ బీచ్‌లో తరచుగా ఇలాంటి ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈత కోసం సముద్రంలోకి వెళ్లిన చాలా మంది గల్లంతవుతున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో 8మంది ఇటలీ పర్యాటకులు సముద్రంలో కొట్టుకుపోగా.. లైఫ్ గార్డ్స్ సకాలంలో స్పందించటంతో అందరి ప్రాణాలు మిగిలాయి.
Also Read: https://teluguprabha.net/career-news/high-paying-jobs-in-software/
పర్యాటకులకు ఆనందాన్నిచ్చే ఇలాంటి సుందర సాగర తీరంలో ఇలాంటి విషాద ఘటనలు చోటుచేసుకోవడం ప్రకృతి ప్రేమికులను కలచివేస్తున్నాయి. ఒక్కసారిగా అలలు ఎగిసిపడుతుండటంతో కొందరు కెరటాలకు బలవుతున్నారు. పోలీసులు, మెరైన్ పోలీసులు, లైఫ్ గార్డ్స్ నిత్యం పహారా కాస్తున్నా సాగర తీరంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.


