వైసీపీకీ(YCP) మరో భారీ షాక్ తగిలింది. అధికారం కోల్పోయిన నాటి నుంచి ఇప్పటికే అనేక మంది కీలక నేతలు పార్టీకి రాజీనామా చేయగా తాజాగా మరో నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్(Ex IAS Officer Imtiaz) వైసీపీకి రాజీనామా చేశారు. ఇక రాజకీయాలకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు. ఐఏఎస్ అధికారిగా పనిచేసిన ఇంతియాజ్ ఎన్నికల ముందు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వైసీపీలో చేరారు. కర్నూలు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఇంతియాజ్.. ఇప్పుడు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు పార్టీ అధినేత జగన్‌కు రాజీనామా లేఖను పంపించారు.
“అందరికీ నమస్కారం.. కొన్ని నెలల క్రితం ప్రజాసేవే ధ్యేయంగా, ముఖ్యంగా కర్నూలు నగరంలో ఉన్న పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఐఏఎస్ సర్వీస్ నుండి వీఆర్ఎస్ తీసుకొని రాజకీయాల్లోకి రావడం జరిగింది. కర్నూలు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం, ఎన్నికల ఫలితాలు మీ అందరికీ తెలిసిందే. గత కొంత కాలంగా బంధుమిత్రులు మరియు శ్రేయోభిలాషులతో చర్చించి ఒక నిర్ణయానికి రావడం జరిగింది.. అదేమిటంటే.. రాజకీయ రంగం నుంచి దూరంగా జరగటం. రాజకీయాలకు దూరం అవుతున్నాను.. కానీ ప్రజసేవ రంగానికి కాదు” అని లేఖలో పేర్కొన్నారు..