క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా, పేలుడు పదార్థాల వినియోగం కేసులో మాజీ మంత్రి.. వైఎస్సార్సీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొన్ని నెలలుగా పరారీలో ఉన్న ఆయనను కేరళలో పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో ఫిబ్రవరిలో నమోదైన కేసులో కాకాణి నాలుగవ నిందితుడిగా ఉన్నారు. కేసు నమోదైన తర్వాత పోలీసులు మూడు సార్లు విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేసినా, కాకాణి స్పందించలేదు. విచారణకు హాజరయ్యే బదులు పరారీలోకి వెళ్లిపోయారు.
హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాల్లో గాలించిన పోలీసులు, చివరకు కేరళలో ఆయనను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే ఆయనను నెల్లూరుకు తరలించే అవకాశం ఉంది. కేసు విషయంలో ముందస్తు బెయిల్ కోసం కాకాణి సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఇప్పటికే హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో అక్కడ కూడా నిరాశ ఎదురైంది. కోర్టు బెయిల్ ఇవ్వలేనని స్పష్టం చేసింది.
వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లాలో క్వార్ట్జ్ తవ్వకాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. గని లీజు గడువు ముగిసినా తవ్వకాలు కొనసాగించారని, భారీగా పేలుడు పదార్థాలు నిల్వ ఉంచినట్టు సమాచారం. దాదాపు రూ.250 కోట్ల విలువైన క్వార్ట్జ్ అక్రమ రవాణా జరిగిందన్న ఆరోపణలతో ఈ కేసు తెరపైకి వచ్చింది. ఇప్పటివరకు పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్న కాకాణి… చివరకు కేరళలో పట్టుబడటంతో ఈ కేసులో కీలక మలుపు తిరిగినట్టైంది.


