మాజీ మంత్రి విడదల రజనీకి చెందిన అవినీతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె మరిది విడదల గోపినాథ్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలిలో ఆయనను అదుపులోకి తీసుకొని, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి ఏపీకి తరలించారు. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు తీసుకున్న కేసులో అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
ఇదే కేసులో ఈ ఏడాది మార్చిలో మాజీ మంత్రి విడదల రజనీపై కూడా ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 2020లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీలక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఆమెను ప్రధాన నిందితురాలిగా (ఏ1) పేర్కొన్నారు.
రెండో నిందితుడిగా ఐపీఎస్ అధికారి జాషువా, మూడో నిందితుడిగా గోపి, నాల్గవ నిందితుడిగా ఆమె వ్యక్తిగత సహాయకుడు దొడ్డ రామకృష్ణలను చేర్చారు. ఫిర్యాదు ప్రకారం, రజనీ వాటాగా రూ.2 కోట్లు తీసుకున్నట్టు, మిగిలిన 20 లక్షల రూపాయలను జాషువా, గోపి కి చెరో 10 లక్షల చొప్పున ఇచ్చినట్టు కేసు నమోదైంది. తాజాగా గోపి అరెస్ట్ కావడంతో ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది.