ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు, కార్యకర్తలు వరుసగా అరెస్టు అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(Pinnelli Ramakrishna Reddy)ప్రధాన అనుచరుడు తురకా కిశోర్(Turaka Kishore) అరెస్ట్ అయ్యాడు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గం పర్యటనకు వెళ్లిన టీడీపీ నేతలు బొండా ఉమా మహేశ్వరరావు, బుద్ధా వెంకన్న కారుపై కర్రతో దాడికి పాల్పడ్డాడు. అప్పట్లో ఈ దాడి పెద్ద సంచలనంగా మారింది. దీనిపై కేసు నమోదైనప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కిశోర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతడిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు మరోసారి పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలియడంతో అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఏపీకి తీసుకొచ్చి జిల్లా కోర్టులో హాజరుపర్చనున్నారు.