భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Venkaiah Naidu) కుంభమేళాలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. దేశం ఆరోగ్యంగా, సౌభాగ్యంగా ఉండాలని గంగామాతను ప్రార్థించినట్లు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద మత, ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా అన్నారు. సనాతన సంప్రదాయం, వారసత్వానికి ఇదో గొప్ప ప్రతీకగా పేర్కొన్నారు.
“ప్రయాగ్ రాజ్‌లోని గంగ, యమున, సరస్వతి నదీమ తల్లుల త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించడం ఓ అలౌకిక ఆధ్యాత్మిక అనుభూతిని అందించింది. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనాల్లో ఒకటి అయిన మహాకుంభమేళా, యుగయుగాల మన భారతీయ సనాతన ధార్మిక వారసత్వానికి ప్రతీక. ఇక్కడ ఆచరించే స్నానం, సకల శుభాలను అందిస్తుందన్నది కోట్లాది భారతీయుల విశ్వాసం. దేశప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు సిద్ధించాలని ఈ పుణ్యస్నానం సందర్భంగా నదీమతల్లులను ప్రార్థించాను.” అని తెలిపారు .
కాగా జనవరి 13న ప్రారంభమైన కుంభమేళాకు(Kumbh Mela) భక్తులు తండోపతండాలుగా తరలివెళ్తున్నారు. మంగళవారం సాయంత్రానికి 55 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. దేశ విదేశాల నుంచి భారీగా సామాన్యులు, ప్రముఖులు తరలి వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారని పేర్కొంది.