Mandava Janakiramaiah passes away: తెలుగు రాష్ట్రాల్లో విషాదం చోటుచేసుకుంది. విజయ డెయిరీ మాజీ ఛైర్మన్ మండవ జానకిరామయ్య (93) ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం గన్నవరం శివారులోని రుషి వాటిక వృద్ధుల నిలయంలో కన్నుమూశారు. మండవ జానకిరామయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ) ఛైర్మన్‌గా సుదీర్ఘకాలం పాటు సేవలందించారు. ఆయన ఏకంగా 27 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగారు.
అసాధారణ కృషి: పాల ఉత్పత్తిదారులకు మెరుగైన సేవలు అందించేందుకు జానకిరామయ్య చాలా కృషి చేశారు. అంతే కాకుండా విజయ డెయిరీని విస్తరించడంలో జానకిరామయ్య చేసిన కృషి అసామాన్యం. పాడి పరిశ్రమ అభివృద్ధికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా డాక్టర్ కురియన్ అవార్డు లభించింది. జానకిరామయ్య మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆయన స్వగ్రామం మొవ్వలో ఈ రోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మండవ జానకిరామయ్యకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.


