G Eswaraiah elected as CPI state secretary: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర కార్యదర్శిగా గుజ్జుల ఈశ్వరయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవాళ (మంగళవారం) విజయవాడలో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఈశ్వరయ్యను ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఏపీ సీపీఐ కార్యదర్శిగా కె.రామకృష్ణ ఉన్నారు. ఆయన్ను చండీగఢ్‌లో జరిగిన జాతీయ మహాసభల్లో జాతీయ కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఆగస్టులో ఒంగోలులో జరిగిన రాష్ట్ర మహాసభల్లో నూతన కార్యదర్శి ఎన్నిక జరగాల్సి ఉండగా భిన్నాభిప్రాయాలు రావడంతో వాయిదా వేశారు. జాతీయ మహాసభలు ముగిసిన తర్వాతే రాష్ట్ర కార్యదర్శిని ఎన్నుకుంటామని సీపీఐ అగ్రనాయకత్వం గతంలో ప్రకటించింది. అయితే, ప్రస్తుతం జాతీయ మహాసభలు ముగియడంతో రాష్ట్ర కార్యదర్శి ఎంపికకు లైన్ క్లియర్ అయ్యింది. దీంతో, విజయవాడలో జరిగిన సీపీఐ రాష్ట్ర స్థాయి సమావేశంలో గుజ్జుల ఈశ్వరయ్యను రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా ప్రకటించారు. సీపీఐ ఏపీ నూతన కౌన్సిల్ 102 మందితో ఎన్నికవ్వగా.. 33మందిని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.
జాతీయ కార్యవర్గంలోకి కె. రామకృష్ణ..
ఎన్నిక ఏకగ్రీవం కావడంతో కె. రామకృష్ణ స్థానంలో ఇకపై ఆ బాధ్యతలను ఈశ్వరయ్య నిర్వహించనున్నారు. గత 11 సంవత్సరాలుగా ఈ పదవిని నిర్వహిస్తున్న కె. రామకృష్ణ స్థానంలో ఈశ్వరయ్యకు కీలక బాధ్యతలు అప్పగించారు. బీసీ వర్గానికి చెందిన ఈశ్వరయ్య సుదీర్ఘ కాలం పాటు ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్, రైతు సంఘం నాయకుడిగా పనిచేశారు. పలు ప్రజా సమస్యలపై పోరాడి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగారు. విజయవాడలో నేడు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా ఆధ్వర్యంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం రాజా మీడియాతో మాట్లాడారు. ‘నేడు సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం విజయవాడలో నిర్వహించాం. నూతన రాష్ట్ర కార్యదర్శిగా గుజ్జుల ఈశ్వరయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. రామకృష్ణ దశాబ్దం పాటు కార్యదర్శిగా సేవలు అందించారు. ఏఐవైఎఫ్ విద్యార్థి విభాగం నుంచి ఈశ్వరయ్య పని చేస్తున్నారు. కడప జిల్లాకు చెందిన ఈశ్వరయ్య ఎన్నో పోరాటాల్లో కీలకంగా వ్యవహరించారు. రామకృష్ణ, ఈశ్వరయ్యకు నా అభినందనలు. ప్రజల కోసం, ప్రజల పక్షాన మా పోరాటం కొనసాగుతుంది.’ అని రాజా తెలిపారు.
విద్యార్థి దశ నుంచే అనేక ఉద్యమాలు..
వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన గుజ్జుల ఈశ్వరయ్య విద్యార్థి దశ నుంచి ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఏపీ విభజన అనంతరం సీపీఐ పార్టీలో ఈశ్వరయ్య అనేక ముఖ్య బాధ్యతలు నిర్వహించారు. ముప్పల నాగేశ్వరరావు వంటి పోటీదారులు మద్దతు తెలపడంతో ఈ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ ఎన్నిక ఏపీ సీపీఐలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సందర్భంగా ఈశ్వరయ్యకు సీపీఐ నేతలు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నారు.


