Gade Venkata Reddy passes away: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి (85) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, శుక్రవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఐదు దశాబ్దాలకు పైగా ప్రజాసేవలో ఉన్న వెంకట్‌రెడ్డి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీలకతీతంగా నివాళులర్పిస్తున్నారు.
Also read: Tiffany Trump: భారత పర్యటనలో ట్రంప్ కుమార్తె.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫోటోలు..!
ఐదు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా..
గాదె వెంకటరెడ్డి రాజకీయ ప్రస్థానం 1967లో 29 ఏళ్ల వయసులో ప్రారంభమైంది. న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించిన ఆయన, ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రకాశం జిల్లాలోని పర్చూరు, బాపట్ల నియోజకవర్గాల నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండు సార్లు మంత్రిగా పనిచేశారు. నాటి సీఎం పీవీ నరసింహారావుతో కలిసి పనిచేశారు. 1993లో కోట్ల విజయభాస్కరరెడ్డి కేబినెట్‌లో ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ మంత్రిగా, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాల్లో దేవాదాయ శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తన నియోజకవర్గంలో రోడ్ల విస్తరణ, గ్రామీణ ప్రాజెక్టుల వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేశారు.
నాటి డీలిమిటేషన్ ప్రక్రియలో కీలక పాత్ర..
గాదె వెంకటరెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోనే కాకుండా, పలు కీలక బాధ్యతలను సైతం చేపట్టారు. నియోజకవర్గాల పునర్విభజన కమిషన్‌లో అసోసియేట్ సభ్యుడిగా, ఏపీ కాంగ్రెస్ కమిటీ డీలిమిటేషన్ కమిటీ ఛైర్మన్‌గా పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా విశేషమైన కృషి చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చర్చల సమయంలో, శ్రీకృష్ణ కమిషన్ ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాణిని కాంగ్రెస్ అధిష్ఠానానికి బలంగా వినిపించారు. బాపట్ల జిల్లా పావులూరు గ్రామంలో 1940 జులై 10న జన్మించిన గాదె వెంకట్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్‌తో ప్రారంభమై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ముగిసింది. ఆయనకు భార్య వీరాంజనేయమ్మ, ముగ్గురు కుమారులు ఉన్నారు. శనివారం ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామం పావులూరుకు తరలించి, అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, గాదె వెంకటరెడ్డి మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ తీవ్ర విచారం తెలిపారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా రాష్ట్రానికి ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “గాదె వెంకటరెడ్డి సుదీర్ఘకాలం ప్రజలకు సేవ చేశారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటు” అంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన తండ్రి రాజశేఖరరెడ్డితో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సహా పలువురు నేతలు ఆయన మృతికి సంతాపం తెలిపారు.

