Homeఆంధ్రప్రదేశ్YSRCP : కరవు కోరల్లో కర్షకుడు.. ప్రచారాల పల్లకీలో కూటమి పాలన: గడికోట శ్రీకాంత్‌రెడ్డి

YSRCP : కరవు కోరల్లో కర్షకుడు.. ప్రచారాల పల్లకీలో కూటమి పాలన: గడికోట శ్రీకాంత్‌రెడ్డి

చిన్నమండెం ( తెలుగు ప్రభ ) : రాష్ట్రంలో వర్షాభావంతో అన్నదాతలు అల్లాడుతుంటే, కూటమి సర్కారు మాత్రం కంటితుడుపు ప్రచారార్భాటాలతో కాలం వెళ్లదీస్తోందని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. హామీల అమలులో తాత్సారం చేస్తూ, క్షేత్రస్థాయి సమస్యలను గాలికొదిలేశారని విమర్శించారు. రైతన్న కన్నీరు కనపడని పాలకుల ప్రాధాన్యాలేమిటి? సంక్షేమాన్ని విస్మరించి సభలకే పరిమితమైన పాలనతో ప్రజలకు ఒరిగేదేమిటి? అనే ప్రశ్నలను ఆయన లేవనెత్తారు.

- Advertisement -

అడుగంటిన ఆశలు.. అటకెక్కిన హామీలు : చిన్నమండెం మండల కేంద్రంలో నిర్వహించిన వైకాపా కార్యకర్తల గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో శ్రీకాంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా మాట్లాడారు.

రైతాంగ సంక్షోభం: గడచిన నాలుగు నెలలుగా సరైన వర్షాలు లేక ఉద్యాన తోటలు నిట్టనిలువునా ఎండిపోతున్నాయని, పంట దిగుబడులకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర నష్టాలపాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మభ్యపెట్టే రాజకీయాలు: మహిళలకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం, యువతకు రూ.3,000 నిరుద్యోగ భృతి వంటి కీలక హామీలను కూటమి పాలకులు అటకెక్కించారని మండిపడ్డారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో చట్టం చేయాలని డిమాండ్ చేశారు.

గత ప్రగతికే సున్నాలు: గత వైకాపా ప్రభుత్వ హయాంలో చిన్నమండెం మండలంలో నిర్మించిన 4 వేల ఇళ్లకే రంగులు వేసి ప్రస్తుత పాలకులు ప్రారంభోత్సవాలు చేస్తున్నారని ఆరోపించారు.

కార్యకర్తలకు భరోసా.. రూ.5 లక్షల సాయం : పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గుర్తింపు కార్డు పొందిన కార్యకర్త ప్రమాదవశాత్తు మరణిస్తే పది రోజుల్లోనే పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక బీమా సహాయం అందజేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి దేవనాథరెడ్డి, జిల్లా అధ్యక్షుడు చుక్కా అంజనప్ప, మండల కన్వీనర్ గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News