భుహక్కు పత్రాలు పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి…
చాగలమర్రి, ఆగస్టు 21 (తెలుగు ప్రభ ) రైతు కార్మిక సంక్షేమమే జగనన్న ధ్యేయమని ఆళ్లగడ్డ శాసనసభ్యులు గంగుల బిజేంద్రారెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే, తహసీల్దార్, గ్రామపంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో తహసిల్దార్ సుభద్రమ్మ, ఎంపీడీవో దౌలా, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏపీడి, ఏపీఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బ్రీజెంద్రారెడ్డి మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం ఆధునీకరణ పరికరాలతో ద్రోన్ ద్వారా రీ సర్వే చేసి కంప్యూటరీకరణ చేయడం జరిగిందన్నారు.
క్షేత్రస్థాయిలో భూమి యొక్క సరిహద్దులు, ఫీల్డ్ మ్యాపులు, తదితర వివరాలను పొందుపరిచి హక్కు పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. సర్వే అధికారులచే రెవెన్యూ సరిహద్దురాళ్లను భూమి చుట్టూ వేసి ఎంతో పారదర్శకంగా రెవెన్యూ రికార్డులలో ఆన్లైన్ ద్వారా నమోదు చేశామన్నారు. ఈ విధంగా చేయడం పొలం గట్ల వద్ద గొడవలు లేకుండా ఉంటాయన్నారు. గతంలో పొలం వివాదాలతో పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాలను ఆశ్రయించి రైతులు ఎంతో వ్యయ ప్రయాసలకు వచ్చి ఇబ్బందులు పడే వారన్నారు. ఈ సమస్యలన్నీటికి స్వస్తి చెప్పి సన్న చిన్న కారు రైతులు, మోతుబరి రైతులకు జగనన్న భూహక్కు పత్రాలు పరిష్కారం చూపుతాయన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు, కార్మిక, కర్షకా, దళిత, బహుజన, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత వైయస్సార్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. అనంతరం తహసిల్దారు సుభద్రమ్మ ఎమ్మెల్యేకు వివరిస్తూ మండలంలో ఆరు గ్రామాలలో భూ సర్వే చేయగా చాగలమర్రి మల్లె వేముల చిన్న వంగలి, పెద్ద వంగలి,వనిపెంట, ముత్యాలపాడు, గ్రామ పంచాయతీలలో భూ హక్కు పత్రాలు పూర్తిస్థాయిలో ద్రోన్ సహాయంతో చేశామన్నారు. చాగలమర్రి 1038 మంది రైతులకు, మల్లె వేముల 631 రైతులకు శాశ్వత బుహక్కు పత్రాలు పంపిణీ చేశామన్నారు. 1895 నుండి 1905 వరకు సుమారు పది సంవత్సరాలు బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో రీ సర్వే చేయడం జరిగిందన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో ఆధునీకరణ యంత్రాలతో 90 రోజులలోనే సర్వే చేసి సమగ్ర వివరాలు భూ హక్కు పత్రాలలో పొందుపరిచి రైతులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ శాఖ అధికారులు, వివిధ గ్రామ పంచాయతీల కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, ఈవోపీఆర్డి సుదర్శన్ రావు, వైఎస్ఆర్సిపి రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ బాబూలాల్, మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు వీరభద్రుడు, జడ్పిటిసి, మండల కో ఆప్షన్ నెంబర్ జిగ్గి గారి ఇబ్రహీం, వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ కుమార్ రెడ్డి, గణేష్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, గొట్లూరు వెంకటసుబ్బారెడ్డి, యువ నాయకులు రమణ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వైయస్సార్సీపి కార్యకర్తలు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.