Gas Cylinder Explodes in Vijayawada:: విజయవాడ ఏసీపీ సత్యానందం ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. పేలుడుతో ఏసీ కంప్రెషర్ ధ్వంసం కాగా.. ఆ ధాటికి ఓ వ్యక్తికి రాయి తగిలి తీవ్ర గాయాలయ్యాయి.
పటమటలంకలోని ప్రత్యూష అపార్ట్‌మెంట్‌లో ఏసీపీ సత్యానందం కుటుంబం నివసిస్తోంది. బాల్కనీలోని ఏసీ కంప్రెషర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా తొలుత మంటలు చెలరేగాయి. అవి పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్‌కు వ్యాపించి పేలుడుకు దారితీసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా, పేలుడు ధాటికి అపార్ట్‌మెంట్ బాల్కనీ, గ్రిల్స్, కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆస్తి నష్టం భారీగానే జరిగినట్లు తెలుస్తోంది.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/nara-lokesh-meets-nitin-gadkari/
మరోవైపు పేలుడు తీవ్రతకు అపార్ట్‌మెంట్ వెలుపల రాయి ఎగిరిపడగా.. అది తగిలి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, ఏసీపీ సత్యానందం తన కుటుంబంతో కలిసి ఈ నెల 7వ తేదీన విదేశీ పర్యటనకు వెళ్లారు. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఏసీపీ సత్యానందం వీఆర్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

