Pudimadaka Giant Shark: అనకాపల్లి జిల్లా పూడిమడక తీరంలో మత్స్యకారుల గాలానికి భారీ సొర చేప చిక్కింది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు.. తొలుత దాన్ని చూసి భయపడినా.. ఆ తర్వాత 5 గంటల పాటు కష్టపడి తీరానికి లాక్కొచ్చారు.
15 అడుగుల పొడవు, 500 కిలోల బరువు..
ఈ సొర చేప 15 అడుగుల పొడవు, 500 కిలోల బరువుతో ఉండడంతో.. మత్స్యకారులు భయపడ్డారు. కానీ ఆ తర్వాత సొరను దగ్గరికి లాగి బల్లేలతో పొడిచారు. అయితే చివరికి పడవలోకి చేర్చలేక అలాగే తాడుతో కట్టి తీరానికి లాక్కొచ్చారు. పూడిమడక తీరంలో ఇప్పటి వరకూ ఇంత భారీ స్థాయిలో సొర చేపను చూడలేదని స్థానికులు తెలిపారు. దీన్ని వేలం వేయగా రూ.34 వేలకు ఓ వ్యాపారి కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని మత్స్యకారులు తెలిపారు. ఇంత పెద్ద సొర చేప మత్స్యకారులకు చిక్కడంతో స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
పట్టుదలతో లాగాం..
“సొరచేప మొదట దగ్గరికి రాగానే గుండె కొట్టుకోవడం మరిచిపోయినట్టుంది. అంత భారీ సొర చేపను చూడడంతో ఓ క్షణం భయపడ్డాం. కానీ వదిలేస్తే జీవితంలో మళ్లీ ఇలాంటిది దొరకదేమో? అనిపించింది. అందరం పడవలో ఒక్కసారిగా ఉత్సాహంగా కదిలిపోయాం. మధ్యలో అలలు ఎంతో దెబ్బకొట్టాయి… కానీ మేము కూడా అట్టే పట్టుదలతో లాగాం. చివరికి తీరం కనిపించగానే ఊపిరి పీల్చుకున్నాం” అని మత్స్యకారుడు మడ్డు నూకరాజు సంతోషం వ్యక్తం చేశారు.


