Atchannaidu : ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నది ఉగ్రరూపం దాల్చడంతో కోనసీమ జిల్లాలో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వరద ప్రభావిత ప్రాంతాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో టెలిఫోన్ ద్వారా చర్చించి, క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వరద ముప్పు ఉన్న గ్రామాల్లో అధికారులు 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ALSO READ: Crime : మహిళను హత్య చేసి ఏడు ముక్కలుగా నరికి బావిలో పడేసి.. ఆపై!
గోదావరి వరదలతో లంక గ్రామాలు జలమయమయ్యాయి. ముక్తేశ్వరం, కోటిపల్లి ఘాట్లు నీటమునిగాయి. అయినవిల్లి మండలంలోని పాత తొగరపాయ వంతెన కూడా నీటిలో మునిగింది. దీంతో స్థానికులు పడవలపై ఆధారపడుతున్నారు. అధికారులు లైఫ్ జాకెట్లు లేకుండా పడవల్లో ప్రయాణించవద్దని హెచ్చరించినప్పటికీ, అమలులో లోపాలు కనిపిస్తున్నాయి.
మంత్రి అచ్చెన్నాయుడు సహాయక చర్యల్లో ఎలాంటి లోటు ఉండకూడదని స్పష్టం చేశారు. అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, రెస్క్యూ టీమ్‌లు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ప్రభుత్వం నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తోందని భరోసా ఇచ్చారు. ఎలూరు జిల్లాలో కలెక్టర్ వెట్రిసెల్వి కూడా సమీక్ష నిర్వహించి, పిల్లలకు పాల సరఫరా, గర్భిణీలను ఆసుపత్రులకు తరలించడం వంటి చర్యలు చేపట్టారు.
వరదల కారణంగా కొబ్బరి తోటలు, హార్టికల్చర్ పంటలు నీటమునిగాయి. స్థానికులు పశువులకు మేత కోసం ప్రభుత్వ సాయం కోరుతున్నారు. ప్రభుత్వం రూ.16 కోట్లు విడుదల చేసి, రెస్క్యూ బృందాలను సిద్ధం చేసింది.


