Good News for Employees: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన చందాదారులకు తీపి కబురు అందించింది. అత్యవసర సమయాల్లో పీఎఫ్ నగదు కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా, నేరుగా యూపీఐ (UPI) ద్వారా విత్‌డ్రా చేసుకునే విప్లవాత్మక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఏడాది ఏప్రిల్ 2026 నుంచి ఈ సదుపాయం చందాదారులకు అందుబాటులోకి రానుంది.
క్షణాల్లో బ్యాంక్ ఖాతాలోకి నగదు
ప్రస్తుతం పీఎఫ్ విత్‌డ్రా చేయాలంటే ఆన్‌లైన్‌లో క్లెయిమ్ ఫారాలు సమర్పించి, అవి ఆమోదం పొంది, బ్యాంక్ ఖాతాలో జమ కావడానికి కనీసం 3 నుంచి 7 రోజులు పడుతోంది. కానీ కొత్త విధానంలో, మీ ఈపీఎఫ్ ఖాతాకు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ద్వారా యూపీఐ పిన్ (UPI PIN) ఎంటర్ చేసి, అనుమతించిన మొత్తాన్ని క్షణాల్లో మీ ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. ఇలా వచ్చిన నగదును మీరు నేరుగా యూపీఐ ద్వారా ఖర్చు చేయవచ్చు లేదా ఏటీఎం ద్వారా డ్రా చేసుకోవచ్చు.
ఎంత నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు?
చందాదారుల భవిష్యత్తు అవసరాలను (Retirement) దృష్టిలో ఉంచుకుని, ఈపీఎఫ్ఓ కొన్ని నిబంధనలను విధించింది. మీ మొత్తం పీఎఫ్ నిల్వలో 25 శాతాన్ని కనీస నిల్వగా ఉంచాల్సి ఉంటుంది. మిగిలిన 75 శాతం మొత్తాన్ని మీరు క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా సులభంగా సాగడానికి వీలుగా ఈపీఎఫ్ఓ ప్రస్తుతం తన ఐటీ సిస్టమ్స్‌ను ఆధునీకరిస్తోంది.
ఇటీవలి ఇతర కీలక మార్పులు
యూపీఐ సదుపాయంతో పాటు, ఈపీఎఫ్ఓ ఇటీవల మరికొన్ని చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. గతంలో రూ. 1 లక్ష వరకు ఉన్న ఆటో సెటిల్‌మెంట్ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచారు. దీనివల్ల ఎటువంటి మానవ ప్రమేయం లేకుండా సాఫ్ట్‌వేర్ ద్వారానే 3 రోజుల్లో నగదు జమ అవుతోంది. గతంలో ఉన్న 13 రకాల సంక్లిష్ట కారణాలను తొలగించి, విత్‌డ్రాయల్స్‌ను కేవలం మూడు ప్రధాన విభాగాలుగా వర్గీకరించారు . వాటిల్లో అనారోగ్యం, ఉన్నత చదువులు, వివాహం. ఇల్లు కొనడం లేదా నిర్మాణం. ఉద్యోగం కోల్పోవడం లేదా ఇతర అనివార్య కారణాలుతో 100 శాతం వరకు నగదు తీసుకోవచ్చు.
డిజిటల్ ఇండియా దిశగా మరో అడుగు
ఈపీఎఫ్ఓ తీసుకుంటున్న ఈ నిర్ణయం వల్ల సుమారు 6 కోట్ల మంది చందాదారులకు ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా ప్రైవేట్ రంగ ఉద్యోగులకు అత్యవసర ఆర్థిక అవసరాల దృష్ట్యా ఇది గొప్ప ఊరటనిస్తుంది. కేవలం ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ మరియు యూపీఐ ఐడి సరిగ్గా లింక్ అయి ఉంటే చాలు, పీఎఫ్ విత్‌డ్రా ప్రక్రియ స్మార్ట్‌ఫోన్ ద్వారా సులభతరం కానుంది.

