అంగన్‌వాడీల(Anganwadis)కు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. కార్యకర్తలు, ఆయాలు ఏళ్లుగా ఎదురు చూస్తున్న గ్రాట్యుటీ అమలుకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత ఇందుకు సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 55,607 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. దాదాపు లక్ష మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయంతో వీరందరికీ ప్రయోజనం చేకూరనుంది. ఎన్ని సంవత్సరాలు సర్వీసులో ఉంటే సంవత్సరానికి 15 రోజుల వేతనం చొప్పున గ్రాట్యుటీ కింద చెల్లిస్తారు.
అంటే ప్రస్తుతం అంగన్వాడీ కార్యకర్తలకు రూ.11,500 వేతనం ఉండగా.. ఇందులో 15రోజుల వేతనం కింద రూ.5,750 వస్తుంది. పదవీ విరమణ వయసు 62 ఏళ్లుగా ఉంది. దీంతో ఈ లెక్కన కార్యకర్తలకు రూ.లక్ష నుంచి లక్షన్నర.. ఆయాలకు రూ.55వేలు నుంచి రూ.75వేలు వరకు అందనుంది. 25ఏళ్లు, 30ఏళ్లకే అంగన్ వాడీ కార్యకర్తలు, ఆయాలుగా చేరిన వారికి పదవీ విరమణ సమయంలో గ్రాట్యుటీ కింద మరింత ఎక్కువ అందుతుంది. ఈ గ్రాట్యుటీ చెల్లింపులకు ప్రతి ఏడాది ప్రభుత్వానికి రూ.20కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు.