Visakha Data Centre Google: విశాఖపట్నంలో గూగుల్ సంస్థ 15 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 1.25 లక్షల కోట్లు) భారీ పెట్టుబడితో అత్యాధునిక డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ నెల 28న ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగనుంది. 1000 మెగావాట్ల సామర్థ్యంతో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే అమెరికా తర్వాత గూగుల్ ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద AI హబ్‌గా, ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ క్లస్టర్‌గా విశాఖ నిలవనుంది.
విశాఖలో గూగుల్ AI డేటా సెంటర్ హబ్ ఏర్పాటు కోసం విశాఖపట్నం పరిసర ప్రాంతాలు మొత్తం 600 ఎకరాలకు పైగా భూమిని కేటాయించారు. అదానీ కనెక్స్, ఎయిర్‌టెల్‌తో కలిసి గూగుల్ ఈ ప్రాజెక్టును చేపడుతోంది. దేశీయంగా డిజిటల్ మౌలిక సదుపాయాలను పెంచడం, AI సేవలను అందించడం, క్వాంటం కంప్యూటింగ్‌ను ప్రోత్సహించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశంగా ప్రభుత్వం వెల్లడించింది. 2028 జూలై నాటికి ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో విశాఖపట్నం ‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఏపీ’గా మారుతుందని, వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

