Narasaraopet JNTU college credit controversy : రాష్ట్రంలో గత ప్రభుత్వం నిర్మించిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను తమ ఖాతాలో వేసుకుంటూ కూటమి ప్రభుత్వం ‘క్రెడిట్ చోరీ’కి పాల్పడుతోందని పలనాడు జిల్లా వైఎస్సార్‌సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం నరసరావుపేట పట్టణంలో ఘన నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు.
సంక్షేమ ప్రదాత వైఎస్సార్: సువర్ణ పాలనకు స్మరణ : డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా స్థానిక 27వ వార్డులో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో గోపిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూపాయికే వైద్యం అందించి ప్రజా హృదయాల్లో ‘డాక్టర్ దేవుడు’గా నిలిచిన మహనీయుడు వైఎస్సార్. ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి విప్లవాత్మక పథకాలతో పేదల బతుకుల్లో వెలుగులు నింపిన యుగపురుషుడు. ఆయన హయాంలో రైతులు, వ్యాపారులు ‘మూడు పువ్వులు ఆరు కాయలు’గా సంతోషంగా జీవించారని, ఆయన అకాల మరణం రాష్ట్రాన్ని తీరని వేదనకు గురిచేసిందని భావోద్వేగంతో గుర్తుచేశారు.
జేఎన్‌టీయూ నిర్మాణం: నరసరావుపేట జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల క్రెడిట్ వివాదంపై గోపిరెడ్డి సవివరమైన వివరణ ఇచ్చారు.
“గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో కపూర్ అసోసియేట్స్ ద్వారా డిజైన్లు రూపొందించి రూ.150 కోట్లు ఖర్చు చేశారు. కళాశాల భవన నిర్మాణంలో 80 శాతం, హాస్టల్ నిర్మాణంలో 40 శాతం పనులు మేం పూర్తి చేస్తే.. ఇప్పుడు కేవలం నామమాత్రపు పనులతో మంత్రి నారా లోకేశ్ ప్రారంభోత్సవానికి రావడం విడ్డూరంగా ఉంది” అని గోపిరెడ్డి ఎద్దేవా చేశారు.
నిత్యావసరాల భారం.. ఆఫ్రికాలా మార్చొద్దు : కూటమి ప్రభుత్వ ఆర్థిక విధానాలపై ఆయన నిప్పులు చెరిగారు.గత ప్రభుత్వాన్ని శ్రీలంకతో పోల్చిన చంద్రబాబు నాయుడు, నేడు రాష్ట్రాన్ని నిరుపేద ఆఫ్రికా దేశాల తరహా దారిద్య్రంలోకి నెడుతున్నారని విమర్శించారు.కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటి సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విభజన రాజకీయాలు, వెన్నుపోటు సిద్ధాంతాలు వీడి, ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని హెచ్చరించారు. 2029 నాటికి ప్రజలే తగిన బుద్ధి చెప్పి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

