AP Govt Panchayat Secretaries: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ కార్యదర్శులకు పే స్కేల్ తగ్గిస్తూ కూటమి ప్రభుత్వం షాకిచ్చింది. జీవో నెంబర్ 91 సవరణతో పంచాయతీ కార్యదర్శులకు పేస్కేల్ తగ్గించడంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. అయితే గతంలో పీఎస్‌లను గ్రేడ్ 5 నుంచి గ్రేడ్ 3 హోదాకు అప్‌గ్రేడ్ చేస్తూ జారీ చేసిన జీవో 91 ప్రకారం వీరికి రూ. 28,290 పేస్కేల్ నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం ఆ ఉత్తర్వులను సవరించింది. జీవో 60ని విడుదల చేయగా తాజా ఉత్తర్వుల ప్రకారం పంచాయతీ కార్యదర్శుల పేస్కేల్‌ను రూ. 25,220 కి తగ్గించింది. ఈ మార్పులకు అనుగుణంగా తక్షణమే తదుపరి చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పంచాయతీ కార్యదర్శులు.. పదోన్నతులు కల్పించినట్టే కల్పించి వేతనం వచ్చేసరికి కోత విధించడం దారుణమన్నారు. దీని వల్ల వేలాది మంది ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడుతుందని.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుందని ఆవేదన వెలిబుచ్చారు. తక్షణమే సవరించిన జీవో 60ని ఉపసంహరించుకుని.. పాత పేస్కేల్‌నే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే నిరసనలు వ్యక్తం చేస్తామని స్పష్టం చేశారు.

