ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులపై(New Ration Cards) కీలక ప్రకటన చేసింది. రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి దరఖాస్తులు స్వీకరిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇందులో కొత్త కార్డులు జారీ, చిరునామా మార్పులు చేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. 3.28 లక్షల దరఖాస్తులు రేషన్ కార్డు మార్పు కోసం వచ్చాయని పేర్కొన్నారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం స్మార్ట్ రేషన్ కార్డు, క్యూ ఆర్ కోడ్‌తో జారీ చేస్తామని వెల్లడించారు. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే గత ఆరు నెలలు రేషన్ తీసుకున్న వివరాలు కనిపించేలా ఉంటుందన్నారు.
వేరే ప్రాంతాలకు వలసవెళ్లే వారు తమ రేషన్ కార్డులను ప్రభుత్వానికి స్వచ్ఛందంగా సరెండర్ చేసుకోవచ్చని సూచించారు. ఈ ప్రక్రియను గ్రామ వార్డు సచివాలయాల ద్వారా నిర్వహిస్తామన్నారు. దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునేలా ఈ కార్డు వెసులుబాటు కల్పిస్తుందని తెలిపారు. జూన్ నెల నుంచే స్మార్ట్ కార్డులు జారీ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం 95 శాతం మేర ఈ-కేవైసీ పూర్తైందన్నారు. కేవైసీ పూర్తి అయిన వాళ్ళు కొత్తగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు.