GST 2.0 Chandrababu Naidu: కేంద్రం చేపట్టిన జీఎస్టీ సంస్కరణలు, ‘జీఎస్టీ బచత్ ఉత్సవ్’పై ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. పరిపాలనలో పౌరుడికే పెద్దపీట వేసేలా ఈ సంస్కరణలు ఉన్నాయని.. ఇదొక సాహసోపేతమైన, దూరదృష్టితో కూడిన సంస్కరణ అని చంద్రబాబు ప్రశంసించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా సీఎం తన స్పందనను తెలియజేశారు.
‘పండుగల సీజన్‌లో ఈ నూతన జీఎస్టీ సంస్కరణలు ప్రజలకు డబుల్ సంబరాన్ని తీసుకొచ్చాయి. తక్కువ ధరలు, సరళీకృత పన్నుల విధానంతో ప్రజలు నేరుగా లబ్ధి పొందుతారు. పన్ను శ్లాబుల సంఖ్యను కేవలం రెండుకు (5%, 18%) తగ్గించారు. దాదాపు 99 శాతం నిత్యావసర వస్తువులు ఇప్పుడు 5 శాతం పన్ను పరిధిలోకి వస్తాయి. ఈ సంస్కరణ మధ్యతరగతి, పేదలు, రైతులు, మహిళలు, యువతతో సహా అందరి జీవితాలను సులభతరం చేస్తుంది” అని చంద్రబాబు పేర్కొన్నారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/nhai-toll-plaza-10-seconds-rule-dasara-traffic-2025/
సరళమైన పన్నుల విధానం వల్ల ఖర్చులు తగ్గి, వ్యాపారాలు వృద్ధి చెంది, పెట్టుబడులు ఆకర్షితమవుతాయని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. వృద్ధిలో రాష్ట్రాలను సమాన భాగస్వాములుగా చేయాలన్న ప్రధాని పిలుపు సహకార సమాఖ్య స్ఫూర్తిని చాటుతోందని ఆయన పేర్కొన్నారు. ఆత్మనిర్భర్, వికసిత భారత్ స్ఫూర్తితో ‘స్వర్ణాంధ్ర’ సాధనకు తాను కట్టుబడి ఉన్నానని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇంకా ఆదివారం విజయవాడ ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జీఎస్టీ 2.0 సంబంధించి తెలుగులో విడుదల చేసిన జీఓల బుక్‌లెట్‌ను చంద్రబాబు ఆవిష్కరించారు. రాష్ట్ర పన్నుల విధానంపై అధికారులతో సమీక్షించారు. సోమవారం నుంచి అమల్లోకి రానున్న కొత్త జీఎస్టీ సంస్కరణలతో రాష్ట్ర ప్రజలకు రూ. 8 వేల కోట్ల వరకు లబ్ధి చేకూరుతుందని, అదనంగా రూ. 2 లక్షల కోట్ల ప్రయోజనం లభిస్తుందని అంచనా వేస్తున్నామని అధికారులు చంద్రబాబుకు వివరించారు.


